బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్, ర్యాలీ నడుమ బయల్దేరారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. రైతుల కోసం, రాష్ట్రం కోసం రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
అది బస్సు కాదు.. తెలంగాణ ప్రగతి రథం..
కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్‌షోలలో పాల్గొంటారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని, అక్కడ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి, అక్కడ కూడా రోడ్‌షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు.