హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్యప్రతినిధి: తెలంగాణ ఎన్నికల యుద్ధానికి సన్నద్దమైన ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. దిమ్మతిరిగే వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీల నేతలకు షాకిస్తున్నారు. ప్రధానంగా ఇటు అధికార బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ సై అంటే సై అంటున్నాయి. వలసలతో కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకోగా, అధికారమే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తోంది. హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాలో ఉన్న బీఆర్ఎస్ వరుస కార్యక్రమాలతో.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. గత 20రోజులుగా నేతలను, క్యాడర్‌ను పూర్తిస్థాయిలో కార్యాచరణలో నిమగ్నం చేసిన సీఎం కేసీఆర్ జులై, ఆగస్టులోనూ ఇదే తరహా కార్యక్రమాలతో నేతలను ప్రజల్లోనే ఉంచనున్నారు. మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలను ఆకర్షించే పనిలో పడింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలను ఆకర్షించడంలో సఫలమైంది. అనూ#హ్యంగా భారతీయ జనతా పార్టీలోకి వలసలు ఆగిపోగా, కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు పెరగడంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పాటుగా బీజేపీ సైతం ప్రత్యామ్నాయ రేసులో కొనసాగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అంతిమంగా అది బీఆర్ఎస్కు మేలు చేకూరుస్తుందని భావించిన కాంగ్రెస్, బీజేపీ హవా తిరోగమన దిశలో ఉన్న తరుణంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపించే నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో సానుకూల ఫలితాలతో ముందుకు సాగుతోంది.
దశాబ్ది హాట్
దశాబ్ది ఉత్సవాలను 22రోజుల పాటు నిర్వహంచడం బీఆర్ఎస్కు అనూ#హ్యంగా కలిసివచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, నేతలు గ్రామాలకు వెళ్ళాల్సి రావడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం కావడంతో ఆయా ప్రాంతాల్లో అంటీముట్టనట్లుగా ఉన్న ప్రజాప్రతినిధులతో సర్దుబాట్లు చేసుకోవడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఏర్పరిచింది. ప్రభుత్వం ఆయా రంగాల్లో చేసిన ప్రగతిని ఆయా వర్గాల ప్రజలకు చెప్పే అవకాశం దక్కింది. దీని ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూరాయని నేతలు లెక్కలు వేసు కుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ పరంగా ఉన్న సమస్యలను దిద్దుకునే అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, దశాబ్ది ఉత్సవాలతో ప్రజలతో అనుబంధం పెంచే వ్యూ#హంతో సక్సెస్ అయ్యారు. ఇక టికెట్ వడపోతలపై కూడా నజర్ పెట్టారు. నేతల గ్రాఫ్‌ను చక్కదిద్దే సూచనలు చేస్తున్నారు.
రసవత్తరం
రసవత్తర రాజకీయాలకు తెలంగాణ వేదికగా మారింది. కర్నాటక ఫలితంతో ఒక్కసారిగా పుంజుకున్న కాంగ్రెస్, వలసలను ఆకర్షించడంలో బీజేపీకన్నా ముందుంది. వలస నేతలకంటే సంప్రదాయ నేతలు, ఆది నుండీ పార్టీనే నమ్ముకున్న నేతలకు ప్రాధాన్యమిస్తున్న బీజేపీ.. అదే పంథాలో ముందుకు సాగాలని డిసైడైనట్లు చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్లోకి వెళ్ళలేని నేతలు, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో పాటు వివిధ జిల్లాలకు చెందిన అనేకమంది నేతలతో చర్చలు జరిపిన కాంగ్రెస్ రానున్నరోజుల్లో మరికొన్ని సంచలనాలు ఉంటాయని చెబుతోంది. పలు ఉప ఎన్నికల్లో అనూహ్యంగా మూడోస్థాయికి పడిపోయిన కాంగ్రెస్ ఇపుడు ఎన్నికల ముంగిట ఒక్కసారిగా నేతలను ఆకర్షించేస్థాయికి చేరడం ఆసక్తికర పరిణామంగా చెబుతున్నారు. పలు పార్టీల విలీనాలపై చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు జరిగే జంపింగ్‌లు ముందే సాగుతున్నాయి. ఏఐసీసీ తెలంగాణ ఎన్నికలను ఈసారి సీరియస్‌గా తీసుకుంటుండగా, రాహుల్ గాంధీ ఈనెల 25న తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు. మరోవైపు బీజేపీ కేంద్ర నేతల పర్యటనలు రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ బీఆర్ఎస్ దుర్భేద్యంగా.. తిరుగులేనివిధంగా ఉండగా, రానున్న రోజుల్లో రాజకీయం ఏ వైపు మలుపులు తిరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ అసెంబ్లిd ఎన్నికల కసరత్తును ఇప్పటికే ప్రారంభించింది.