Saturday, November 23, 2024

తెలంగాణ పద్దు: రేపు మంత్రి మండలి భేటీ.. ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఈనెల 7న (సోమవారం) ఉదయం 11.30 గంటలకు వేర్వేరుగా శాసనసభ, శాసనమండలి సమావేశం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాగా ఈ సమావేశంలో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఉండబోదని ఇప్పటికే ప్రకటించింది. సమావేశాలు ప్రోరోగ్‌ కానందునే స్పీకర్‌ ఆధ్వర్యంలో నేరుగా సమావేశాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రి మండలి సమావేశమై రాష్ట్ర బడ్జెట్‌ 2022-23 ప్రతిపాదనలను ఆమోదించనుంది. 7న శాసనసభలో మంత్రి హరీష్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత బడ్జెట్‌ సమావేశాలను ఎన్ని పని దినాలను నడపాలనే అంశంపై స్పీకర్‌ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశంలో చర్చించి నిర్ణయిస్తారు. ఈ సమావేశాలు ఈనెల 24 వరకు జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. ఈ మేరకు గడిచిన 2020-21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన రాష్ట్ర పద్దులపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన ఆర్థిక నివేదికలను గవర్నర్‌ తమిళిసైకి చేరినట్లు తెలిసింది. సోమవారం మొదటిరోజు శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కాగ్‌ నివేదికలను శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు బడ్జెట్‌పై అధ్యయనానికి సెలవు దినంగా ప్రకటిస్తారు.

శాసనసభ సమావేశ ప్రారంభ తేదీ ఖరారైన నేపథ్యంలో బడ్జెట్‌ కేటాయింపులు, కొత్త పథకాలపై ఉత్కంఠ నెలకొంది. 2022-23 ఆర్థిక ఏడాది పద్దులు ఎలా ఉండనున్నాయన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌ 15 నుంచి 20 శాతం మేర పెరుగుదలతో రూ.2.45 లక్షల కోట్లకు చేరనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ తగ్గించిన నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్‌లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్దులో కోతలు పెట్టనున్నట్టు తెలిసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద కేంద్రం నుంచి రూ.38వేల కోట్లు అంచనా వేసుకోగా, ఇందులో 20 శాతం కూడా లక్ష్యం చేరలేదని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే సవరించిన అంచనాల్లో భాగంగా రెవెన్యూ వ్యయాన్ని 90 శాతానికిపైగా చూపున్నట్టు తెలుస్తోంది. ఈ దఫా బడ్జెట్‌ పద్దులో సొంత వనుల ఆదాయంలో కీలకమైన ఎక్సైజ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్‌ ఆదాయంపై ఎక్కువగా పెంపు ఉండవచ్చని తెలుస్తోంది. పన్నేతర రాబడుల్లో దిల్‌ భూముల విక్రయాలతో పాటు ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ, అసైన్డ్‌ చట్ట సవరణ వంటి వాటిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

వచ్చే ఏడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఏప్రిల్‌ 1లోగా ఆమోదించుకుంటేనే ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగనున్న నేపథ్యంలో సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈనెల 28న యాదాద్రి ఆలయ పున:ప్రారంభ సంబరాల్లో భాగంగా మహా సంప్రోక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ఈలోగా శాసనసభ సమావేశాలను ముగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బడ్జెట్‌లో ఎటువంటి ప్రజలకు భారం లేకుండా పలు సంక్షేమ పథకాల కొనసాగింపుతో పాటు కొత్త పథకాల ప్రస్తావన ఉండనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఉద్యోగ భర్తీకి సీఎం కేసీఆర్‌ శాసనసభ వేదికగా కీలక ప్రకటన చేస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అదే విధంగా రైతు సంక్షేమ పథకాలను మరిన్ని నిధులను పెంచుతూ ప్రాధాన్యత పెంచనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement