కరోనా కేసులతోనే సతమతమవుతుంటే .. మరోపక్క ఒమిక్రాన్ కేసులు కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. కాగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తొమ్మిదికి చేరాయని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఒమిక్రాన్ కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వల్ల ఒక్క మరణమే సంభవించిందన్నారు. తెలంగాణలో కరోనా మూడో దశ విజృంభణ ఎదురైతే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
భవిష్యత్తులో మరో 10 కొత్త కరోనా వేరియంట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోకపోవడమే ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం అన్నారు. ఒమిక్రాన్‌ను కరోనా నుంచి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇంట్లో, బయట మాస్కులు ధరించాలన్నారు. లాక్‌డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దన్నారు. తెలంగాణలో 97 శాతం మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని ఆయన వివరించారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 100 శాతం మంది తొలి డోసు తీసుకున్నారని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..