Tuesday, November 26, 2024

Telangana: పారిశ్రామిక పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించేలా స‌రికొత్త ప్ర‌ణాళిక‌లు: మంత్రి కేటీఆర్

ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, ఈ నేపథ్యంలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులను మంత్రి కే తారకరామారావు ఆదేశించారు. ఈ రోజు ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా సంక్షోభం వలన అనేక రంగాల్లో కొన్ని ఇబ్బందులు, సవాళ్లు తలెత్తినప్పటికి, వివిధ రంగాల్లో భారత్ లాంటి దేశాలకు అనేక నూతన అవకాశాలను కల్పించిందన్నారు.

ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆదర్శవంతమైన విధానాలతో ప్రపంచంలోని అనేక కంపెనీల పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఏడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, సంస్కరణలతో తనదైన ఒక గుర్తింపును సాధించినదని, ఈ గుర్తింపు ద్వారానే సంక్షోభ కాలంలోనూ అనేక పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగామని కేటీఆర్ అన్నారు. ప్రస్తుత కరోనా సంక్షోభ అనంతర కాలంలోనూ మరిన్ని నూతన పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేద్దామన్న కేటీఅర్, నూతన పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అన్నారు.

ఈ దిశగా భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న వివిధ దేశాల కంపెనీలతో వివిధ సమావేశాలను ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆయా దేశాల్లోని పారిశ్రామిక వర్గాలను తెలంగాణకు ఆహ్వానించి, ఇక్కడి పరిస్థితులను వివరించెలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని కేటీఆర్ అధికారులకు సూచించారు. వచ్చే సంవత్సరంలో వివిధ పారిశ్రామిక రంగాల వారీగా పెట్టుబడులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల మరియు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు వివిధ విభాగాల డైరెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement