నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు ఏ అభ్యర్థి మ్యాజిక్ ఫిగర్‌కు చేరువకాలేకపోయారు. దీంతో మిగిలిన రౌండ్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 66 మంది ఎలిమినేట్ అయ్యారు. కాగా ఇంకా ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 66 మంది ఎలిమినేట్ అయ్యే సమయానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,17,386, తీన్మార్ మల్లన్న 91,858, కోదండరామ్ 79,110 ఓట్లతో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. తర్వాతి స్థానాల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాములునాయక్ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఐదుగురిలో చివరికి ముగ్గురు ఎలిమినేట్ కాగా, మరో ఇద్దరి మధ్య పోటాపోటీ ఉండనుంది. 66 మంది ఎలిమినేట్ అయ్యే సమయానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
అటు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 76 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. వారి తొలగింపు అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి, బీజేపీ- 882 , టీఆర్ఎస్-1036, నాగేశ్వర్- 709, కాంగ్రెస్-465.. మొత్తం ఓట్లు: బీజేపీ-105550, టీఆర్ఎస్- 113725, నాగేశ్వర్-54319, కాంగ్రెస్-32019.