తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత తీసుకొనేందుకు రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం ఢిల్లీకి వెళ్తున్నది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్వర్యంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర అధికారులతో కూడిన బృందం వెళ్లనుంది. ఈ బృందం కేంద్ర ప్రభుత్వంతో జరిగే చర్చల్లో పాల్గొననున్నది. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం కానున్నది.
ఈ నెల 23న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌తో జరిపిన చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే నాటి భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై పూర్తి స్పష్టత ఇవ్వని కేంద్ర మంత్రులు ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్తోంది. కేంద్రం ఇచ్చే స్పష్టతకు అనుగుణంగా యాసంగిలో అనుసరించాల్సిన విధానంపై రైతులకు మార్గ నిర్దేశం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..