తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీళ్ల దొంగ అంటూ తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వైఎస్ ను టార్గెట్ చేశారు. మావోయిస్టుల పేరుతో ఎంతో మందిని వైఎస్ బలి తీసుకున్నారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణలోని భూములు, ఆస్తులను వైఎస్ దోచుకున్నారని, అక్రమ కేసులతో అమాయకులను వేధించారని మండిపడ్డారు.
ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెప్పారు. ‘’ తెలంగాణ నరరూప రాక్షసుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఉద్యమంలో ఉన్నవారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. తెలంగాణ నీటిని దోచుకుంటుంటే వైఎస్సార్‌ను దొంగ అనక ఏమంటారు? దొంగను దొంగ అనకుండా దొర అంటారా? ఏపీతో ఎంత మంచిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నా.. జగన్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో బలహీనవర్గాలను జగన్ అణగదొక్కుతున్నారు’’ అని శ్రీనివాస్‌గౌడ్ వ్యాఖ్యానించారు. నీటి పంచాయితీలతో మళ్లీ గొడవలు వద్దని హితవు పలికారు. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తప్పు చేస్తే.. కొడుకు అలా ఉండడు అనుకున్నామన్నారు. తప్పు దిద్దుకుంటారని చర్చలు జరిపామని తెలిపారు. తెలంగాణ వెనుకబాటు తనానికి కూడా వైయస్సారే కారణమని మంత్రి ఆరోపించారు. పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా ఆయనే కారణమన్నారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయి.. పాలమూరు జిల్లా ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుర్మార్గుడు వైఎస్సార్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: వాటర్ వార్: గొడవంతా కృష్ణా జలాలపైనే!