Thursday, November 21, 2024

నేతలందరూ పాదయాత్రలు బ్రహ్మాండంగా చేయాలి: కేటీఆర్

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు పాదయాత్రలు చేస్తామని ఇటీవల ప్రకటనలు చేశారు. దీంతో ఆయా పార్టీ నేతలపై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో వ్యంగాస్ర్తాలు సంధించారు. సింగ‌రేణి బీఎంస్ అధ్య‌క్షుడు కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌సంగించారు.

తెలంగాణ‌లో పాద‌యాత్ర‌ల సీజ‌న్ మొద‌లైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు, ఆయా పార్టీల నేత‌లు ఒక‌రికి మించి ఒక‌రు ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటున్నారని.. పాద‌యాత్ర‌లు బ్ర‌హ్మాండంగా చేయాలని వ్యంగ్యంగా మాట్లాడారు. క‌రోనా కాలం కాబ‌ట్టి పాదయాత్ర వల్ల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని అని చుర‌క‌లంటించారు. పాద‌యాత్ర చేస్తాన‌న్న బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌తి ఊరును సంద‌ర్శించి ప‌రిశీలించాల‌ని కేటీఆర్ సూచించారు. ప‌ల్లెలు ప్ర‌గ‌తి బాట‌లో ఎలా వెళ్తున్నాయో చూడాల‌న్నారు. తెలంగాణ‌లోని గ్రామాల్లో రైతు వేదిక‌లు, ప్ర‌కృతి వ‌నాలు, వైకుంఠ‌ధామాలు, డంప్ యార్డులు ఏర్పాటు చేశామని.. ప్ర‌తి గ్రామానికి ట్యాంక‌ర్, ట్రాక్ట‌ర్ స‌మ‌కూర్చామన్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌తో ప‌ల్లెలు ప్ర‌గ‌తి బాట‌లో ప‌య‌నిస్తున్నాయ‌ని తెలిపారు. ఇలాంటి అభివృద్ధి ప‌నులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమ‌ల‌వుతున్నాయా? అని ప్ర‌శ్నించారు. గత ఏడేళ్లలో బీజేపీ తెలంగాణ‌కు ఏం చేసిందో చెప్పాల‌ని బండి సంజ‌య్‌కు స‌వాల్ చేశారు. కాళేశ్వ‌రం, సీతారామ, పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు జాతీయ హోదా ఇవ్వ‌మంటే ఇవ్వ‌రని.. మిష‌న్ భ‌గీర‌థ‌, కాక‌తీయ ప‌థ‌కాల‌కు నిధులు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ సిఫార‌సు చేసినా కేంద్రం స్పందించ‌లేదని కేటీఆర్ విమర్శించారు.

ఈ వార్త కూడా చదవండి: గులాబీ కండువా కప్పుకోనున్న ఎల్.రమణ

Advertisement

తాజా వార్తలు

Advertisement