Friday, November 22, 2024

Telangana Medical Hub – ద‌వాఖానాల‌కు మ‌హ‌ర్ద‌శ‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:

రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఆస్పత్రుల విస్తరణ పనులు చేపట్టి, ఆ తరువాత మిగతా ఆస్పత్రులను విస్తరించనున్నారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్‌, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రులకు రోజూ వేల సంఖ్యలో ఓపీ ఉంటోంది. అయితే, చాలా ఏళ్ల క్రితం నిర్మించినవి కావడంతో ఈ ఆస్పత్రులకు వచ్చే రోగులతో పాటు సహాయకులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవలే నిమ్స్‌ ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం కోసం 32 ఎకరాలు కేటాయించి రూ.1571 కోట్లకు పరిపాలనా అనుమతులిచ్చారు. 14 అంతస్థులతో 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2వేల పడకలతో నిమ్స్‌ కొత్త ఆస్పత్రి భవనాన్ని నిర్మించనున్నారు. గత ఏడాది సీఎం కేసీఆర్‌ వరంగల్‌లో శంకుస్థాపన చేసిన హెల్త్‌ సిటీ పనులు సైతం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి.

త్వరలో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన మరోవైపు, ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన అంశం రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రి కొత్త భవనం నిర్మాణం అంశం హైకోర్టు ఉంది. దీనిని కూడా త్వరలోనే పరిష్కరించి కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ వారంలోనే ఉస్మానియా ఆస్పత్రిలోని పురాతన కట్టడాలకు నష్టం వాటిల్లకుండా సమీపంలో కొత్త భవనాలను నిర్మిస్తామని హైకోర్టులో తుది పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం.

సరోజనీదేవీ ఆస్పత్రికి కొత్త భవనం
ఇక హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున మెహిదీపట్నంలో ఉన్న సరోజినీదేవి కంటి ఆస్పత్రి కూడా అదే స్థితిలో ఉంది. ఈ ఆస్పత్రికి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు సమీపంలోని కర్నాటక రాష్ట్ర్రం నుంచి కూడా ప్రతీ రోజూ రోగుల వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణం అంశం కూడా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. రెండేళ్ల క్రితం ఈ ఆస్పత్రి నూతన భవన నిర్మాణం అంశం ప్రభుత్వం దృష్టికి రాగా, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ పాత భవనాన్ని పరిశీలించి కొత్త భవనం నిర్మాణానికి రూ.400 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపింది.

అయితే, కరోనా తరువాత ఈ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరగడం, ప్రస్తుతం ఉన్న భవనం ఇరుకుగా మారి రోజూ వస్తున్న రోగులకు ఇబ్బందిగా మారడంతో త్వరలోనే ఇక్కడ కొత్త భవన నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆస్పత్రి భవనం దుస్థితిని ఇటీవల ఆస్పత్రిని సందర్శించిన సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు దృష్టికి వైద్యులు తీసుకొచ్చారు. ప్రస్తుతం 10.79 ఎకరాలలో ఉన్న ఈ ఆస్పత్రికి సమీపంలోనే ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలం ఉందనీ, ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన భవనం నిర్మించడానికి అవకాశం ఉందని మంత్రి హరీష్‌ రావుకు వివరించారు. దీంతో ఈ ఆస్పత్రికి కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన పనులకు త్వరలోనే సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేసే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement