Wednesday, November 20, 2024

కల్తీ కట్టడికి తెలంగాణ పకడ్బందీ చర్యలు.. నాచారంలో ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఆహార కల్తీ మాఫియా పెచ్చుమీరిపోతోంది. మూడు కల్తీలు.. ఆరు నాసిరకం ఆహార పదార్థాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ రాజ్యమేలుతోంది. కల్తీరాయుళ్లు డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆహార కల్తీ కారణంగా జనానికి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కారంపొడిలో రంపపు పొట్టు, అరటి బోదెల పేస్టులో హానికరమైన యాసిడ్‌లు కలిపి అల్లం వెల్లుల్లి పేస్టు, యూరియాతో పాలు, కల్తీ వంట నూనెలు, పాడైన కూరగాయలను రసాయనాలతో కలిపి తాజాగా చేయటం, దొడ్డు బియ్యాన్ని మరపట్టి సన్నబియ్యంగా అమ్మటం, మరోవైపు ప్లాస్టిక్‌ బియ్యం, ప్లాస్టిక్‌ కోడిగుడ్లు ఇలా కల్తీ సామ్రాజ్యం తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని హరించివేస్తోంది. పైగా కల్తీ పదార్థాలను బ్రాండెడ్‌ పేరుతో అంటగడుతుండడం కొసమెరుపు. దీంతో ఏది తినాలో, ఏది తినకూడదో… కొనుగోలుకు ముందు ఏది అసలో, ఏది నకిలీయో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు.

రెండు రోజుల క్రితం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం ఖానాపూర్‌ పట్టణ శివారులో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ దందా బహిర్గతమైంది. దీంతో మరోసారి ఆహారపదార్థాల కల్తీపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పోలీసుల దాడుల్లో ఒక్క ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే కోటి రూపాయల విలువ చేసే కుళ్లిన అల్లం, వెల్లుల్లి సీజ్‌ అయింది. ఇళ్ల మధ్యనే ఏళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడుస్తోండటం గమనార్హం. చాలా హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు, దాబాలు, మెస్‌లు, కిరాణా షాపుల్లో లభించే పలురకాల సరుకులు ఇలా ప్రతి వస్తువు, పదర్థాన్ని కల్తీ వెంటాడుతోంది. వీటిని తినాలన్న, కొనాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న విమర్శలు ఉన్నాయి. మెట్‌పల్లి పట్టణంలో చాలామంది కనీస ప్రమాణాలు సైతం పాటించక పోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలను తయారుచేసే, విక్రయించే షాప్‌లతోపాటు కల్తీ సరుకులు విక్రయించే షాపులు పెద్ద సంఖ్యలో దందా సాగిస్తున్నాయి. చాట్‌ హోటళ్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లకు అనుమతులు కూడా లేవు. ఆహార పదార్థాలను తయారు చేసే కేంద్రాల్లో చాలావాటికి రిజిస్ట్రేషన్లు లేవు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తినుబండారాలను తయారు చేస్తున్న, అల్లం, కారం, పసుపు ఇలా వంట సరుకులను తయారు చేస్తున్న, ఆహార పదర్థాలను వండి వడ్డించే హోటళ్లపైనా సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కరువవటమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధిక లాభార్జన ధ్యేయంగా కొంతమంది కల్తీ సరుకులు, ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. చాటా టిఫిన్‌ సెంటర్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, మెస్‌లు, హోటళ్లలో ఆహార తయారీ నిబంధనలు అమలు కావటం లేదు.

ఆహార కల్తీ కట్టడిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఆహార కల్తీ కట్టడిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కొద్ది రోజుల కిందటే హైదరాబాద్‌లోని నాచారంలో ప్రత్యేకంగా ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. రూ.10 కోట్లతో నాలుగు ఫుడ్‌ టెస్టింగ్‌ మొబైల్‌ బస్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కల్తీ ఆహారంతో అనేక రకాల వ్యాధులు దాడి చేస్తుండడంతో ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. కల్తీ ఆహారం, సరుకులపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా 040-2111-1111 నంబరును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ బస్సుల సంఖ్యను జిల్లాలకూ విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌కు కేటాయించిన నాలుగు బస్సు ల తరహాలోనే జిల్లాకో బస్సు కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు టీఎస్‌ఎంఐడీసీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement