దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఎంతలా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి వేవ్ తో పోల్చితే సెకండ్ వేవ్ అతి తీవ్రంగా ఉండడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, ఒడిషా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ విధించాయి. ఢిల్లీలో మే 10వ తేదీ వరకు లాక్ డౌన్ ఉంది. కోవిడ్ ను తట్టుకోవడానికి మహారాష్ట్ర కూడా మే 15వ తేదీ వరకు తాళం వేసేసింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ విధించబడింది. గుజరాత్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ విధించారు. అయితే, తెలంగాణలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే అమలులో ఉంది. రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టే అవకాశం లేదని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. దానివల్ల ఆర్థికంగా మరింత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చెవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో లాక్ డౌన్ లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని, ఆరోగశ్రీలో కోవిడ్‌ను చేర్చడం ద్వారా పేదలకు కేసీఆర్ సహాయం చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోరారు. కొత్త ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన సీఎం కేసీఆర్… కరోనాపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని సూచించారు.
ఇదీ చదవండి: ఈ కరోనా వేరియంట్ చాలా ప్రమాదకరం.. వ్యాక్సిన్‌లనూ బోల్తా కొట్టిస్తోంది: WHO