Saturday, November 23, 2024

వైద్య ఆరోగ్యరంగంలో మూడో స్థానంలో తెలంగాణ.. చివరిస్థానంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్​ రాష్ట్రాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వైద్య, ఆరోగ్యరంగంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంటే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్లు ఉన్న రాష్ట్రాలు చివరి స్థానంలో ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. దేశానికి డబుల్‌ ఇంజీన్‌ సర్కారు పెద్ద ట్రబుల్‌ ఇంజిన్‌గా పరిణమించిందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలతో ఎలాంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా రెండు మూడు రోజుల్లో 58 టిఫా స్కానింగ్‌ యంత్రాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి కళాభవన్‌లో ఆదివారం జరిగిన ఏఎన్‌ఏంల రెండవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొవిడ్‌ సమయంలో ఏఎన్‌ఎంలు విశేష సేవలు అందించారని అభినందించారు. వైద్య,ఆరోగ్య సిబ్బందితోపాటు పారిశుధ్య, పోలీసు, మున్సిపల్‌ సిబ్బంది కూడా ప్రాణాలను ఫణంగా పెట్టి శ్రమించారని చెప్పారు. కరోనా కాలంలో కొందరు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పారు. కరోనా కాలంలో ధైర్యంగా పనిచేసిన స్ఫూర్తితో అందరూ కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మించాలని పిలుపునిచ్చారు.

ఏఎన్‌ఎంలు రెండో మహాసభలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంలో ఏఎన్‌ఎంలదే కీలక పాత్ర అని చెప్పారు. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దెన్‌ క్యూర్‌ అన్న నానుడిని అమలు చేయడంలో ఏఎన్‌ఎంలదే ముఖ్యమైన పాత్ర అని స్పష్టం చేశారు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ వ్యాధి ఉన్నట్లు చాలా మందికి తెలియదని, వాటిని ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే దీర్ఘకాలిక రోగాలు రావని ఏఎన్‌ఎంలకు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement