Thursday, November 21, 2024

గ్రీన్ సొల్యూష‌న్స్‌లో తెలంగాణ ముందంజ.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కేటీఆర్

వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 9వ రీజినల్ యాక్షన్ గ్రూప్ సదస్సులో మంత్రి కే .తారకరామారావు ఈరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకున్న ఇంధన వనరులు, విద్యుచ్ఛక్తి నుంచి గ్రీన్ పవర్ దిశగా గ్రీన్ ట్రాన్సిషన్ దిశగా పెట్టుకున్న లక్ష్యాలను అందుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగం కలిసి పని చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ లక్ష్యాలను పూర్తి చేయాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని, ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు, పాలసీల నిర్మాణం వాటి అమలు విషయంలో మరింత వేగంగా ముందుకు పోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రీన్ ట్రాన్సిషన్, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ రాష్ట్రం చురుగ్గా ముందుకుపోతున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన సోలార్ పవర్ పాలసీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రిక్ స్టోరేజ్ సొల్యూషన్స్ పాలసీ రాష్ట్రంలో గ్రీన్ విద్యుత్, గ్రీన్ సొల్యూషన్స్ వైపు తెలంగాణను తీసుకుపోతున్నదని కేటీఆర్ అన్నారు. దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 3.5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశం ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్ శక్తి లో 4.2 గిగా వాట్ల సామర్థ్యంతో 10.30 శాతం కలిగి ఉండడం, గ్రీన్ సొల్యూషన్స్, క్లీన్ ఎనర్జీ పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందని కేటీఆర్ తెలిపారు. రానున్న సంవత్సరంలో సుమారు ఆరు గిగా వాట్ల స్థాయికి రాష్ట్రంలో సోలార్ ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కేవలం ఇంధన అవసరాలకోసం సోలార్, విండ్ ఎనర్జీ, మరియు ఎలక్ట్రిక్ వాహనం రంగం పైన ఫోకస్ చేస్తూనే హరితహారం అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఒకవైపు కార్బన్ ఏమిషన్లను తగ్గించడంతో పాటు ఫారెస్ట్ కవర్ ని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ ప్రయత్నంలో డ్రోన్ పాలసీ తీసుకువచ్చి డ్రోన్లతో సీడ్ బౌలింగ్‌ చేస్తూ, హరిత కవర్ పెంచేందుకు టెక్నాలజీని ఆసరాగా తీసుకుంటున్నామని తెలంగాణ చేపట్టిన పలు కార్యక్రమాలను ఉదాహరించారు. ప్రపంచం వేగంగా కార్బన్ ఉద్గారాల విషయంలో నెట్ జీరో స్థాయిని సాధించాలంటే ఈ రంగంలో ఇన్నోవేషన్ ను, స్టార్టప్లకు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నెట్ జీరో స్థాయిని సాధించేందుకు క్లీన్ ఎనర్జీ వనరులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

దీంతోపాటు గ్రీన్ సొల్యూషన్ లను పట్ల విద్యారంగంలో మార్పులు చేయడం ద్వారా అవగాహన కల్పించేందుకు అవకాశం ఉందని, ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బ్రాండె అధ్యక్షత వహించిన ఈ వర్చువల్ సదస్సుకి బంగ్లాదేశ్ మాల్దీవ్స్, యూఏఈ వంటి దేశాల మంత్రులతోపాటు పలు వాహన, ఇంధన రంగ కంపెనీల అధినేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement