Saturday, November 23, 2024

అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా తెలంగాణ‌.. కేంద్ర బ‌డ్జెట్‌లో ఫండ్స్ కేటాయించాలే.. నిర్మ‌ల‌మ్మ‌కు కేటీఆర్ లేఖ‌

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి, టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. తెలంగాణలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆ లేఖ‌లో కోరారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి పారిశ్రామిక రంగ అభివృద్ధిలో తెలంగాణ ముందుందని వెల్లడించారు. నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్రానికి గతంలో అనేకసార్లు విజ్ఞప్తులు చేశామని పేర్కొన్నారు. వినూత్నమైన విధానాలతో ముందు వరుసలో నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సహాయం అందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇండస్ట్రియల్ కారిడార్ కు కూడా నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ లను గుర్తించిందని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇండస్ట్రియల్ కారిడార్ లో భాగమైన హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ అభివృద్ధికి అవసరమైన ఆర్థికసాయాన్ని సత్వరమే అందజేయాలని తెలిపారు. గత ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్ర రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఈ నేపథ్యంలో కేంద్రం ప్రతిపాదించిన రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ల పరిధిలో హైదరాబాద్ ను కూడా చేర్చాలని నిర్మలా సీతారామన్ ను తన లేఖలో కోరారు.

కాగా, ఈ నెల 31న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర వార్షిక బడ్జెట్ కు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణకు వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టేందుకు మంత్రి కేటీఆర్ ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement