Friday, November 22, 2024

జూలైలో తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. ప్రాక్టికల్స్ వాయిదా

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను జూలై రెండో వారంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు రాష్ట్ర‌ ఇంట‌ర్ బోర్డు తెలిపింది. ప్ర‌శ్నాప‌త్రాలు ఇప్ప‌టికే ప్రింట్ అయి ఉండ‌టంతో ప‌రీక్షా విధానంలో ఎటువంటి మార్పు లేదంది. కాగా కోవిడ్ నేప‌థ్యంలో మూడు గంట‌ల‌ ప‌రీక్షా స‌మ‌యాన్ని 90 నిమిషాల‌కు కుదించింది. అంతేకాకుండా ప్ర‌శ్నాప‌త్రంలో 50 శాతం ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాస్తే స‌రిపోతుందంది. దీన్నే 100 శాతానికి ప‌రిగ‌ణిస్తామ‌ని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా కేంద్ర విద్యా మంత్రిత్వ‌శాఖ‌కు పంపిన లేఖ‌లో పేర్కొన్నారు.

కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రెండు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను ఉపయోగించడం ద్వారా ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. జూలై మధ్య నుండి పరీక్షలను నిర్వహించి ఆగస్టు చివరి నాటికి ఫలితాలను ప్రకటించవచ్చ‌ని తెలిపింది. కోవిడ్ లేదా ఇంకా ఏవైనా కార‌ణాల వ‌ల్ల ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేని విద్యార్థుల‌కు మ‌రో అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

మరోవైపు ఈ నెల 29 నుంచి జరగాల్సిన ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను వాయిదా వేస్తూ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్ గురువారం ప్రకటించారు. జూన్‌ మొదటి వారంలో పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు నిర్వహించే 15 రోజుల ముందు షెడ్యూల్‌ ప్రకటిస్తామని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని కోరారు. దీంతో ఈ నెల 29 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు జరగాల్సిన ప్రాక్టికల్స్‌ నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement