ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ స్కూళ్లలో తెలుగును ద్వితీయ భాషగా, తప్పనిసరిగా బోధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం లేకుండా తెలుగును బోధించాలని ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2018-19 నుంచి దశలవారీగా తెలంగాణ (పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి బోధన, అభ్యాసం) చట్టం 2018 అమల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.
భావితరాలకు ఉపయోగపడేలా తెలుగు భాషా, సాహిత్యాన్ని పరిరక్షించేందుకు అన్ని పాఠశాలల్లో మాతృభాషను తప్పనిసరి చేశారు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు తెలుగు భాషా బోధనను తప్పనిసరి చేశారు. ఈ విద్యాసంవత్సరం అంటే 2022-23లో అన్ని పాఠశాలల్లో 1-10వ తరగతి వరకు తెలుగును ఒక భాషగా అమలు చేస్తారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు మాతృభాష కాని పిల్లల కోసం 1-5వ తరగతి వరకు ‘తేనెపలుకులు’, 6 -10వ తరగతి వరకు ‘వెన్నెల’ పేరుతో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. తెలుగు మాతృ భాషగల విద్యార్థుల కోసం ప్రామాణిక పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచారు. 1-5వ తరగతి వరకు ‘జాబిలి’, 6,7,8 తరగతుల కోసం ‘నవ వసంతం’, 9,10వ తరగతులకు ‘సింగిడి’ పేరుతో పుస్తకాలను రూపొందించారు. ఈ పుస్తకాలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి ఎస్సీఈఆర్టీ వెబ్సైట్ http://scert.telangana.gov.in లో అందుబాటులో ఉంచారు.
ఇక.. వివిధ బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని పాఠశాలలు తెలుగు బోధించేందుకు ఉపాధ్యాయులను నియమించడంతోపాటు ఎస్సీఈఆర్టీ రూపొందించిన పాఠ్యపుస్తకాలను అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని, తప్పు చేసిన యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీచేస్తామని, జరిమానా విధించడం లేదా గుర్తింపు రద్దుచేయడంలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.