తెలంగాణలో కరోనా సెంకడ్ వేవ్ రెట్టింపు వేగంతో దూసుకెళ్తోంది. రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ, కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకుంటుండటంతో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అదే తరహాలో నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కరోనాను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెట్ విచ్చలవిడిగా సాగుతోందని, బ్లాక్ మార్కెట్ దందా అరికట్టేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపై త్వరలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని మహమూద్ అలీ చెప్పారు. సమీక్ష అనంతరం లాక్ డౌన్ పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అయితే, రాష్ట్రంలో లాక్ డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్కు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయని మహమూద్ అలీ చెప్పారు.
రాష్ట్రంలో పరిస్ధితులు అదుపు తప్పడంతో ప్రభుత్వం కనీసం సమీక్షా సమావేశాలు జరపడం లేదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమూద్ అలీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవిడ్ నుంచి కోలుకున్నారు. సీఎంకు నిర్వహించిన యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. అయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితం గురువారం రానుంది. అనంతరం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.