హైదరాబాద్ మల్లాపూర్‌కు చెందిన పావని అనే గర్భిణి మృతి కేసుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు ఆస్పత్రులు తిరిగినా ఎక్కడ హాస్పిటల్‌లో చేర్చుకోలేదు. దీంతో సరైన సమయంలో చికిత్స అందించక పోవడంతో నాలుగు రోజులు క్రితం పావని మృతి చెందింది. తల్లి కూతురును వేరు చేస్తే కానీ దహనం చేయబోమని నిర్వాహకులు తేల్చి చెప్పారు. ఎనిమిది నెలల గర్భిణి మృతిపై పూర్తి విచారణ చేసి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, పావని అనే 8 నెలల గర్భిణికి ఆయాసం రావడంతో తల్లి మల్లాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కరోనా ఉండొచ్చనే అనుమానంతో చికిత్స చేయమని చెప్పారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో అంబులెన్స్‌లో ఎక్కించి మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. ఎల్బీ నగర్ లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా బతకడం కష్టమని చెప్పారు డాక్టర్లు. కోఠికి గానీ, గాంధీ ఆస్పత్రికి గానీ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో కోఠి ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే మార్గం మధ్యలోనే అంబులెన్స్ లో ప్రాణాలు విడిచింది. అంబులెన్స్ లో ఐదు ఆస్పత్రులు తిరిగినా వైద్యం అందక కళ్ల ముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపించింది ఆ తల్లి. ఇది ఇలా ఉంటే ..అంత్యక్రియల కోసం ఆమె మృతదేహాన్ని మల్లాపూర్ శ్మశాన వాటికకు తీసుకెళ్తే.. అక్కడ లోపలికి రానివ్వలేదు. తల్లిని బిడ్డను వేరుచేస్తేనే దహనం చేస్తామని చెప్పారు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్తే మృతదేహానికి ఆపరేషన్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏమి చేయాలో తెలియక ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లింది తల్లి. ఓ వైపు కన్నబిడ్డ మరణించిందని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఇది మరింత వేదన మిగిల్చింది.
ఇదీ చదవండి : క్రమంగా పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు