తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేదాకా సభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు తీర్పు వెలువరించింది. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఈ నెల 7న బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా తమను సభ నుంచి సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వులను వెంటనే కొట్టేసి, తాము అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. సస్పెన్షన్ తీర్మానం, వీడియో రికార్డులు సమర్పించేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.