Tuesday, November 26, 2024

తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా నియంత్రణలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సినిమా థియేటర్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. కరోనా నియంత్రణ చర్యలపై ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఇవ్వడం లేదని న్యాయస్థానం ఆరోపించింది. పబ్బులు, మద్యం దుకాణాలు నడపడడమే ప్రభుత్వానికి ముఖ్యమా అని సూటిగా ప్రశ్నించింది.

జన సంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ సమాధానం ఇవ్వగా.. ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? లేదా తాము ఆదేశాలు ఇవ్వాలా అని హైకోర్టు మండిపడింది. ప్రభుత్వ నిర్ణయాలను మధ్యాహ్నంలోగా నివేదించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భోజన విరామం తర్వాత తిరిగి ఈ అంశంపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. మధ్యాహ్నం విచారణకు సంబంధిత విభాగానికి చెందిన అధికారులు హాజరు కావాలని ఆదేశాల్లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement