Tuesday, November 26, 2024

యూఎస్​, యూకే మాదిరిగానే ఇద్దాం.. బూస్టర్ పై రిస్ట్రిక్షన్స్ వద్దు.. కేంద్రానికి మంత్రి హరీశ్ లేఖ

కరోనా వ్యాక్సిన్ తీసుకును ఒకటి రెండు డోసుల మధ్య దూరాన్ని తగ్గించాలని, అదేవిధంగా కొవిడ్ వారియర్స్కి అందించే టీకా విరామాన్ని కూడా తగ్గించాలని తెలంగాణ హెల్త్ మినిస్టర్ తన్నీరు హరీశ్రావు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవియాకు లేఖ రాశారు. రెండో టీకా మోతాదు విరామాన్ని 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని లేఖలో హరీశ్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులందరికీ రెండో డోస్ , బూస్టర్ డోస్ మోతాదు మధ్య విరామాన్ని 3 నెలలకు తగ్గించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కూడా లేఖలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.

కోమోర్బిడిటీలతో సంబంధం లేకుండా 60 ఏళ్లు పైబడిన పౌరులందరినీ బూస్టర్ డోస్ మోతాదులో చేర్చాలని కోరారు మంత్రి హరీశ్. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ బూస్టర్ డోస్‌ను ఇవ్వాలని రాష్ట్రం, కేంద్ర ఆరోగ్య మంత్రికి సూచించింది. USA, UK వంటి దేశాల్లో అమలవుతున్న బూస్టర్ డోస్ విధానాల ఆధారంగా ఈ సూచనలు, అభ్యర్థనలు ఉన్నాయని లేఖలో మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై నిన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పురపాలక, పంచాయతీరాజ్ శాఖ అధికారుల సహాయం తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఈ విషయమై జిల్లా మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దని, కరోనా నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని సీఎం రాష్ట్ర ప్రజలను కోరారు. కాగా, ప్రతి రోజు కనీసం 1 లక్ష కొవిడ్ RT-PCR పరీక్షలు నిర్వహించేలా చూడాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement