Tuesday, November 19, 2024

రోజుకు లక్ష కొవిడ్ టెస్టులు.. ఆక్సిజన్ కొరత లేదు!

కొత్త మ్యుటేష‌న్ల కార‌ణంగా క‌రోనా వేగంగా వ్యాపిస్తోంద‌ని తెలంగాణ ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు అన్నారు. రాష్ర్టంలో కొవిడ్ చికిత్స‌కు ప‌డ‌క‌లు, మందులు, ఆక్సిజ‌న్ కొర‌త లేదని స్పష్టం చేశారు. 116 ప్ర‌భుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కొన‌సాగుతుంద‌ని తెలిపారు. క‌రోనా రెండో ద‌శ వ్యాప్తి ఉధృతంగా ఉందన్నారు. రాష్ట్రంలో రోజుకు ల‌క్ష‌కు పైగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నామని చెప్పారు. కేవ‌లం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యిందని వివరించారు. నిన్న ఒక్క‌రోజే ల‌క్షా 26 వేల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే.. 4,446 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన తొలినాళ్ల‌లో 18 వేల బెడ్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య‌ను 38 వేల‌కు పెంచామ‌న్నారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో బెడ్ల సంఖ్య‌ను 53 వేల‌కు పెంచుతామ‌ని చెప్పారు. కొవిడ్ టెస్టుల సంఖ్య‌ను కూడా పెంచుతామ‌ని వెల్లడించారు.

జీహెచ్ఎంసీ ప‌రిధిలో 5 కొవిడ్ ప్ర‌త్యేక ఆస్ప‌త్రులు నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్య‌ను పెంచుతామ‌ని ప్రకటించారు. 80 శాతం మంది క‌రోనా బాధితుల్లో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు అని వెల్లడించారు. కరోనా పాజిటివ్ రాగానే ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. క‌రోనా తొలి ద‌శ నుంచి ప్ర‌జ‌లు పాఠాలు నేర్చుకోలేదని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.. క‌రోనా వెళ్లిపోయింద‌నే భ్ర‌మ‌లో ప్రజలు ఉన్నారని చెప్పారు. గాలి నుంచి వ్యాపించే ద‌శ‌కు క‌రోనా చేరుకుంద‌ని పేర్కొన్నారు.

ప్ర‌తి ఒక్క‌రూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని సూచించారు. రెమిడిసివిర్ దివ్య ఔషధం కాదన్నారు. జూన్ వరకు కరోనా తో జాగ్రత్తగా ఉండాల్సిందేనని, పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని హెచ్చరించారు. మ‌హారాష్ట్ర నుంచి ఓ ఉత్స‌వం నిమిత్తం స‌రిహ‌ద్దు జిల్లాకు కొంత మంది వచ్చారని తెలిపారు. వారిలో కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆ ఐదుగురి కాంటాక్ట్స్‌ను గుర్తించ‌గా మ‌రో 34 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలిందని తెలిపారు. అలా 34 మంది 433 మందికి క‌రోనా వ్యాపించిందని వివరించారు. ఇదంతా కేవ‌లం 12 రోజుల్లోనే జరిగిపోయింద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement