తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. అయితే అది ఓమిక్రాన్ వేరియంటా? లేక డెల్టా వేరియంటా? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రపమత్తమైంది. మాస్క్, వ్యాక్సిన్ పై తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు విధించింది.
మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా వేయాలని పోలీసు శాఖకు వైద్యశాఖ సూచించింది. మాస్క్ ఖచ్చితంగా ధరించాలన్న ప్రభుత్వం.. బహిరంగ ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలని ఆదేశించింది. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాల్సిందేని స్పష్టం చేసింది. హోటల్, పార్క్, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడికి వెళ్లినా వ్యాక్సినేషన్ పత్రం ఖచ్చితం చేయాలని నిర్ణయించింది. వ్యాక్సిన్ వేసుకొనివారికి ఎక్కడికెళ్లినా త్వరలో నో ఎంట్రీ రూల్ అమలు చేయనున్నారు. 20కి పైగా దేశాలలో ఒమిక్రాన్ వ్యాపించిందని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది.
రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది. 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఆమెకు టిమ్స్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలిపింది. జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించామని, ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.