ట్యాంక్ బండ్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయనుంది. సోమవారం ప్రభుత్వం తరఫున హౌజ్ మోషన్ పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌లో గణేశు నిమజ్జనం యథావిధిగా చేసుకునేలా హైకోర్టు అవకాశమివ్వాలని ధర్మాసనాన్ని కోరకున్నట్లు చెప్పారు. ట్యాంక్ బండ్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని వినాయక చవితికి ఒక రోజు ముందు హైకోర్టు తీర్పు వచ్చిందని, అప్పటికే విగ్రహాలు మండపాలకు చేరాయన్నారు. ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యంకాదని తెలిపారు. హైదరాబాద్‌లో కుంటల ఏర్పాటు ఇబ్బందితో కూడుకున్నదని, హైకోర్టు క్షేత్రస్థాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. భవిష్యత్‌లో ముందస్తు ఆదేశాలిస్తే ఏర్పాట్లు చేసుకుంటామని వెల్లడించారు. హైకోర్టు పెద్దమనసు చేసుకుని తీర్పునివ్వాలని తెలిపారు.
కాగా, ట్యాంక్‌బండ్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని తీర్పునిచ్చింది. మట్టి వినాయకులను మాత్రమే నిమజ్జనం చేయడానికి అనుమతించింది.
ఇది కూడా చదవండిః 3 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలిః కేంద్రానికి స్థాయీ సంఘం సిఫార్సు