కరోనా దెబ్బకు అతలాకుతలమైన తెలంగాణకు ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. అయితే, ప్రభుత్వం మాత్రం హంగూ ఆర్భాటాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెటడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అదనపు కలెక్టర్ల కోసం ప్రభుత్వం అత్యంత ఖరీదైన కియా కార్నివాల్ కార్లను కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. గ్రామాల్లో పర్యటించడానికి వీలుగా అదనపు కలెక్టర్లకు ఈ నూతన వాహనాలను సమకూర్చారు. కరోనాతో ఆర్థిక వ్యవస్థ బాగోలేదని, ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గిందని చెబుతున్న సర్కార్.. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక్కోటి దాదాపు రూ. 30 లక్షల విలువ చేసే 32 కియా కార్లను ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లకు ఇస్తుండటం విమర్శలకు తావు ఇచ్చింది.
ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా టీఆర్ఎస్ సర్కార్ మార్చిందని ఓవైపు ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం మాత్రం తమ గొప్పల కోసం అదే పనిగా ప్రజల సోమ్మును వృధా చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమంటే చేర్చరు కానీ.. గొప్పల కోసం అడిషనల్ కలెక్టర్లకు కియా కార్లు ఇవ్వడం అవసరమా ? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ విమర్శించారు. జనం సొమ్ము కార్ల పాలు అయ్యిందని, వీటిని అంబులెన్స్ లు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దేశానికి కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధి చేయాల్సింది పోయి.. అత్యవసరంగా కార్లను కొనుగోలు చేయాల్సి అవసరం ఏమొచ్చిందని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం అంతకంతకూ పెరిగిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల మొత్తం ఇంచుమించు రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంది. వీటికి కట్టే కిస్తీలు, మిత్తీలకే బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు కేటాయించారు. ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధిలో ప్రభుత్వం చేసిన అప్పులు 2022 మార్చి నాటికి రూ. 2,86,804 కోట్లకు చేరనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర బడ్జెట్లోనే ప్రభుత్వం అధికారికంగా ప్రస్తావించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున రుణాల సమీకరణకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మొత్తం రూ. 49,300 కోట్ల మేరకు అప్పులు తీసుకోనున్నట్లు వెల్లడించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే దాదాపు 5 వేల కోట్ల అప్పు ఎక్కువగా ప్రతిపాదించింది. సర్కార్ తీసుకునే అప్పులతో రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.