రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే 20 వేల పోలీసు పోస్టులను భర్త చేయనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. సంగారెడ్డిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని నిన్న ప్రారంభించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్టు మహమూద్ అలీ తెలిపారు. వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు చెప్పారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వివిధ విభాగాలలో ఇప్పటివరకు 80 వేల మందికి పైగా రిక్రూట్ చేసినట్లు చెప్పారు. మహిళా ప్రాధాన్యతలో భాగంగా నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. మహిళలకు రక్షణ నిమిత్తం షీ టీమ్స్ ఏర్పాటును చేశామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలోనూ పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందన్నారు. గత సంవత్సర కాలంగా లాక్‌డౌన్ సమయాల్లో పోలీసుల త్యాగాలను హోంమంత్రి ప్రశంసించారు. పోలీసుశాఖకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహమూద్ అలీ తెలిపారు.
ఇది కూడా చదవండి: హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ.. గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ సెక్రటరీ