Saturday, November 23, 2024

పీఆర్సీ అమలు: ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో పీఆర్సీ అమలుకు ఆమోదం తెల‌ప‌గా తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. పెంచిన పీఆర్సీని జూన్ నెల వేతనాల్లో కలిపి చెల్లించాల‌ని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9,21,037 ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, పింఛన్‌దారులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్‌ అమలు కానుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలకు పెరగనుంది. 2018 జులై 1 నాటికి ఉన్న డీఏ 30.392 శాతం మూల వేతనంలో కలుస్తుంది. మొత్తం 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయనుండగా.. అందుకు అనుగుణంగా ఉద్యోగుల వేతన సవరణ స్కేళ్లను ప్రభుత్వం సవరించింది. జూన్‌ నెల నుంచి ఉద్యోగులకు పెరిగిన వేతనాలు అందనున్నాయి. ఏప్రిల్‌, మే నెల బకాయిలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

 ప్రస్తుతం ఉన్న 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లను కొనసాగిస్తున్నట్టు స్పష్టంచేసింది. ఇప్పటివరకు రూ. 12 లక్షలుగా ఉన్న రిటైర్మెంట్ గ్రాట్యుటీని 16 లక్షలకు పెంచింది. అలాగే పెన్షనర్ల మెడికల్ అలవెన్సులను రూ. 350 నుంచి రూ. 600కు పెంచింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం  నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి.

నోషనల్ బెనిఫిట్​ను 2018 జులై ఒకటి నుంచి, మానిటరీ బెనిఫిట్​ను 2020 ఏప్రిల్ ఒకటి నుంచి, క్యాష్ బెనిఫిట్​ను 2021 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. 2018 జులై తర్వాత పదవీ విరణమ చేసినా 2020 పీఆర్‌సీ ప్రకారమే పింఛన్‌ను అందించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కనీస పింఛన్‌ రూ.6,500 నుంచి రూ.9,500 వరకు పెరగనుంది. రిటైర్‌మెంట్‌ గరిష్ఠ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. పింఛన్‌దారుడు, కుంటుంబీకులకు మెడికల్‌ అలవెన్స్‌ నెలకు రూ.600 పెంచినట్లు తెలిపింది. సీఎం కేసీఆర్ ఆదేశాల  మేరకు ఉద్యోగుల వేతనాల పెంపుతోపాటు సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ అమలు తదితర నిర్ణయాలతో వరుసగా 10 పీఆర్సీ జీవోలు విడుదల చేసింది.

ఇదీ చదవండి: కరోనా నుంచి కోలుకున్న వారికి ఒక్క డోసు టీకాతోనే అధికంగా యాంటీబాడీలు వృద్ది: ఏఐజీ

Advertisement

తాజా వార్తలు

Advertisement