తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేస్తారా? లేక కొనసాగిస్తారా? అన్నది నేటి కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది. వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ సత్ఫలితాలు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు పూర్తిగా తగ్గాయి. దీంతో లాక్ డౌన్ కొనసాగించాలా లేక, మరన్ని సడలింపులు ఇవ్వాలా? అన్న దానిపై కేబినెట్ చర్చించనుంది. థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్ అమలులో ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో ఈ నెల 20వ తేదీ నుంచి లాక్ డౌన్ ఎత్తివేసి.. నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతడ్డాయి. కేసుల ఉద్ధతి తగ్గడంతో థియేట్లు తెరుచునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా ? అన్నది ఉత్కంఠగా మారింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమ చాలా వరకు నష్టపోయింది. షూటింగ్లు లేక వివిధ విభాగాల్లో పని చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి వచ్చింది. దీంతో సినిమా థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గతంలో లాగే కరోనా నిబంధనలు అనుసరిస్తూ థియేటర్లు తెరుచేందుకు యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, థియేటర్లు తెరిచినా ప్రజలు సినిమా చూసేందుకు వస్తారా? లేదా? అన్న ప్రశ్న వారిని వేధిస్తోంది. ఒక వేళ నైట్ కర్ఫ్యూ అమలైతే థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.
ఇది ఇలా ఉంటే.. ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలను పున:ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపింది. దీనిపై కూడా కేబినెట్ చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.