కేంద్రం ఇప్పటి వరకు కరోనా విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఎం లేదని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు అన్ని కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారన్నారు. కేంద్రం చేయాల్సిన తప్పులన్ని చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదని పేర్కొన్నారు. ఏడాది నుండి కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని చెప్పారు. రాష్ట్రంపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు అర్థ రహితమన్నారు. వ్యాక్సిన్లు, ఇంజెక్షన్లు అన్ని కేంద్రం చేతిలోనే పెట్టుకున్నారని అన్నారు. కేంద్రం చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉంటే ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారికి కూడా వైద్యం అందిస్తున్నామని మంత్రి ఈటెల చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి తెలంగాణకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటారని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి 19 డయాగ్నోస్టిక్ సెంటర్లలలో వివిధ పరీక్షలను నిర్వహించేలా సీఎం ఆదేశించారన్నారు. 19 జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం ఈ సెంటర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. నల్గొండ, అసిఫాబాద్. జగిత్యాల్, జనగామ, జోగులంబ, కొత్తగూడెం, మెదక్, ములుగు, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, మహబూడ్ నగర్ జిల్లాల్లో లాబ్స్ అందుబాటులో తీసుకొచ్చామన్నారు.
తెలంగాణకు ఆక్సిజన్ 360 టన్నులను కేటాయించిదని తెలిపారు. అయితే, కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆక్సిజన్ 600 మెట్రిక్ టన్నులకు పెంచాలని కేంద్రన్ని కోరినట్లు ఈటెల తెలిపారు. రాష్ట్రాలలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల కేంద్రమే బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచించాలని కోరారు. రెమిడెసివర్ ఇంజక్షన్ పై కేంద్రం ఇష్టం వచ్చిన రేట్లు పెంచిందని మండిపడ్డారు. మూడు వేల రూపాయలు ఉన్న ఇంజక్షన్ రూ.30 వేలకు అమ్ముతున్నారన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ఇండియాకు సహాయం చేస్తాం అన్న పరిస్థితికి దేశం వచ్చిందన్నారు.
రాష్ట్రంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వ్యాక్సిన్లు వస్తే కచ్చితంగా వేస్తామని అంతేకానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ సాధ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణలో 18 ఏళ్ళు పైబడిన యువకులు 1.7 కోట్ల మంది ఉన్నారని వీళ్లకు రెండు డోసుల చొప్పున 3 కోట్ల డోసులు అవసరం అవుతాయని చెప్పారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం మరోసారి పునరాలోచించాలని కోరారు. తెలంగాణలో ఏప్రిల్ 30 తర్వాత వస్తున్న లాక్ డౌన్ విధిస్తారనే ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని మంత్రి ఈటెల స్పష్టం చేశారు.