తెలంగాణలోని అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నది. వినియోగదారునికి సరసమైన ధరల్లో పరిశుద్ధమైన మాంసం అందించడం లక్ష్యంగా పశుసంవర్ధకశాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మొదటగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కబేళాలు లేదా మేకల వధశాలలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఒకటి లేదా రెండు, జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతీ జోన్ లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిని అక్కడ స్థానికంగా ఉండే మటన్ షాపులకు లింక్ చేయనున్నారు. అక్కడి నుంచే మాంసం సరఫరా చేస్తారు. దుకాణదారులు ప్రభుత్వం అందించిన మాంసాన్నే విక్రయించాల్సి ఉంటుంది.
దీనిద్వారా వినియోగదారులకు శుద్ధమైన మాంసం అందడంతోపాటు, తక్కువ ధరకు లభించే అవకాశం ఉంటుంది. మాంసం దుకాణాల్లో శుభ్రత పాటించేలా నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మాంసం శుద్ధిగా ఉండేలా దుకాణాల్లో రిఫ్రిజిరేటర్‌ను కూడా అందుబాటులో ఉంచుతారు. దుకాణాల ఆధునీకరణకు అవసరమైతే బ్యాంకుల నుంచి రుణం కూడా ఇప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 10 వేల దాకా మటన్ షాపులు ఉండగా.. రెండువేల దుకాణాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ షాపులన్నింటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలని భావిస్తున్నారు. తెలంగాణలో మత్స్యసంపద భారీగా పెరిగినప్పటికీ.. మత్స్యకారులకు మాత్రం అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదనే అభిప్రాయం ఉంది. మత్స్యకారులకు దక్కాల్సిన లాభాలను దళారులు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో దళారులకు చెక్ పెట్టడంతోపాటు మత్స్యకారులకు లాభాలు అందించేలా ప్రభుత్వమే నేరుగా చేపలను కొనుగోలు చేసి.. విక్రయించాలని యోచిస్తున్నది. హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా ప్రభుత్వం నుంచే సైప్లె చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ