Saturday, November 23, 2024

‘దళిత బంధు’ పథకం దరఖాస్తుకు ప్రత్యేక యాప్..!

తెలంగాణలో ఎస్సీల ఆర్థిక సాధికారత కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వెబ్‌ పోర్టల్‌ తోపాటు యాప్‌ను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి ఆగస్టు తొలి వారానికి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సీజీజీకి సూచించింది.

దళిత బంధు పథకం కింద నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల కోసం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ పథకాల్లో లబ్ధిపొందని వారిని తొలి ప్రాధాన్యం కింద గుర్తించాలని, ఆ తర్వాత కేటగిరీల వారీగా అర్హులను ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం 119 నియోజకవర్గాలలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రైతుబంధు మాదిరే సాయాన్ని ఎంపికైన కుటుంబాల పేరిట నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం ప్రకటించారు. రైతుబంధు తరహాలోనే ఈ పథకాన్ని కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ముందు నిర్ణయించిన ప్రకారమే రూ.1,200 కోట్లతో తెలంగాణ దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుందని, అయితే పైలట్‌ ప్రాజెక్టు అయినందున హుజూరాబాద్‌కు అదనంగా రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 26న ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దళిత బంధు అవగాహన కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశంలో పథకం అమలుకు మార్గదర్శకాలను సర్కార్ ప్రకటించే అవకాశం ఉంది. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై వారికి సీఎం కేసీఆర్ స్వయంగా అవగాహన కల్పించనున్నారు. ఈ సమావేశం కోసం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కలిపి నలుగురికి ఆహ్వానం అందింది. అలాగే ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున.. మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు ఈ సదస్సులో పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్సు సిబ్బంది కూడా పాల్గొంటారు. మొత్తం 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొనున్నారు.

కాగా, దళితుల కోసం ఇంత భారీ ఎత్తున ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం చేపట్టలేదని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఈ పథకం పేద దళితుల జీవితాలను మారుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇది కూడా చదవండిః దళిత బంధు పథకం ఉద్దేశం ఏంటి? హుజురాబాద్ ప్రజలకు వివరించనున్న కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement