Tuesday, November 19, 2024

Tribal and Adivasi fair: మేడారం జాతరకు రూ.75 కోట్లు విడుదల

ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 75 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన, ఆదివాసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన, ఆదివాసీ జాతర గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత వైభవంగా జరుగుతోందన్నారు. కరోనా కష్టకాలం వల్ల బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ సమ్మక్క – సారలమ్మ జాతరకు 75 కోట్ల రూపాయలను మంజూరు చేశారని తెలిపారు. గిరిజన, ఆదివాసీలు, వారి ఆచారాలు, పండగలు, జాతరల పట్ల సీఎం కేసిఆర్ కి ఉన్న ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాల పండగలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. అన్ని కులాలు, మతాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి, వారి పండగలు జరిపేందుకు నిధులు కేటాయించి, సెలవులు ప్రకటించి, అధికారికంగా నిర్వహిస్తూ అన్ని వర్గాలను గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.

గత ఏడాది కూడా 75 కోట్ల రూపాయలను అంతకుముందు వంద కోట్ల రూపాయలను సమ్మక్క – సారలమ్మ జాతరకు కేటాయించి, అక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడం కోసం ఏర్పాట్లు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇప్పటికే అనేక శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలతో మేడారంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేశామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతర కోసం వారం రోజుల కిందే 2.24 కోట్ల రూపాయలతో దుస్తులు మార్చుకునే గదులు, ఓ.హెచ్.ఆర్.ఎస్, కమ్యునిటీ డైనింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మిగిలిన వసతులన్నీ కూడా డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ మార్గదర్శనంలో అన్ని ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికలతో అధికారులు పనులు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement