Saturday, November 23, 2024

తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. తొలి రోజు ఇలా!

కరోనా సెకండ్ వేవ్ లో విజృంభిస్తున్న వేళ దాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఇది మంగళవారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. రాత్రి 9 గంటల తర్వాత జిల్లాలతోపాటు రాజధాని హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో ఎవరికి వారు దుకాణాలను మూసివేశారు. ఇంకా తెరిచి ఉన్న వ్యాపార సముదాయాలను పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి మూసివేయించారు.

మరోవైపు, నైట్ కర్ఫ్యూ తో హైదరాబాద్‌ లో ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి. సాధారణంగా నగరంలో రాత్రి వేళ సైతం ప్రధాన రోడ్లు ట్రాఫిక్ రద్దీతో కనిపిస్తుంటుంది. కానీ కర్ఫ్యూ కారణంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా ప్రైవేటు వాహనాలు మాత్రం రోడ్లపై తిరుగుతూనే కనిపించాయి. దూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి గమ్య స్థానానికి వెళ్లేందుకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ మెట్రో సహా ఎలాంటి ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో పలువురు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో ప్రజల నుంచి ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్స్ ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేశారు.

కరోనా కట్టడికి తెలగాణ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ప్రజలు ఇల్లు దాటి బయటికి రావొద్దని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. రాత్రి 8 గంటల్లోపే అన్ని వ్యాపారసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు, సంస్థలు, రెస్టారెంట్లు మూసేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు మే 1 ఉదయం 5 గంటల వరకు అమల్లో ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లు, పోలీస్‌ సూపరింటెండెంట్లు కఠినంగా అమలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement