ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు మేరకు తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ అన్ని విషయాలపైనా చర్చించారని చెప్పారు. ఆ తర్వాతే సెలవులపై నిర్ణయం తీసుకున్నారన్నారు. పాఠశాలలు, కాలేజీ పున:ప్రారంభంపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 26వ తేదీనే చివరి పనిదినమన్నారు.
ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.