తెలంగాణ రాష్ట్రం అవతరించి ఏడేళ్లు పూర్తిచేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరించి వేడుకలు చేసుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో, స్వరాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంతో రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ కొత్త చరిత్రను సృష్టిస్తోంది అని కొనియాడారు. ప్రభుత్వం, ప్రజల కృషితో కొవిడ్ నుంచి త్వరలోనే బయటపడుతామన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు రాష్ర్ట ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని గవర్నర్ సూచించారు.