Friday, November 22, 2024

Telangana – సర్కారుకు రిలీఫ్​! కలిసొచ్చిన ఎన్నికల కోడ్‌


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కొత్తగా ప్రభుత్వం ఎటువంటి పథకాల వ్యయాలకు మదన పడాల్సిన అవసరం, ఆదుర్దా తప్పింది. ముగుస్తున్న ఆర్థిక ఏడాది రాబడులు కొంత కుదుటపడుతుంటే.. ఖర్చులకు కాస్తంత వెసులుబాటు కలిసిసొస్తోంది. గడచిన రెండు నెలల్లో రాబడి అదనంగా ₹8 వేల కోట్లు సమకూరగా, హామీల పేరుతో అయిన ఖర్చు అదనంగా ₹ 5 వేల కోట్లకే చేరింది. దీంతో సర్కార్‌ ఆదాయ, వ్యయాలు అదుపులోనే ఉండి మిగులుకు చేరింది.
క్రమంగా పెరుగుతున్న ఆదాయం

రెండు నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో, సంస్కరణలతో రాష్ట్ర పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. అదే సమయంలో ఆరు గ్యారెంటీలు మొదలుకొని అనేక వ్యయాలు ఖజానాకు కష్టంగా మారాయి. గత అప్పులకు తోడు ఇతర వ్యయాలతో సతమతమవుతున్న ప్రభుత్వానికి ఎన్నికల కోడ్‌ కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎక్కడా ఎటువంటి కొత్త పథకాలకు మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఎన్నికల కోడ్‌ సమయం కాస్త రిలీఫ్​ ఇవ్వనుంది. అయితే.. ఉద్యోగ నియామకాలు, గతంలోనే ప్రకటించిన గ్యారెంటీలు, ఇతర ఆర్థిక భారాలను ఎన్నికల కోడ్‌లో కూడా కంటిన్యూ చేయాల్సిందే. సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగులకు వేతనాలు, వడ్డీ, అప్పుల చెల్లింపులు, పింఛన్లు తదితరాలకు సరిపోగా గడచిన రెండు నెలలుగా మిగులు ఆదాయం వస్తోంది.

ఆదాయం పెంచుకునే ఆలోచనలు..

గడచిన డిసెంబర్‌, జనవరి నెలల్లో రూ.28,425 కోట్ల రాబడి సమకూరింది. అంటే గత ప్రభుత్వంలో సగటున నెలకు రూ.10 వేల కోట్లకు ఆదాయం మించకుండా ఉండేది. ఇందులో అనేక అవకతవకల నేపథ్యంలో రాష్ట్ర ఖజానాపై పెను భారం పడేది. తద్వారా ఏడాదికి ఆశించిన లక్ష్యంలో భారీగా కోతలు పెరగడం ఆనవాయితీగా వచ్చేంది. అయితే కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంస్కరణలు, ఆదాయాలను పెంచుకునే మార్గాలను పరిశీలించి అమలు చేసింది. రాబడుల లీకేజీలను కట్టడి చేసింది. దీంతో ఈ రెండు నెలల్లోనే రూ.8 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. అయినప్పటికీ ఖర్చులు కూడా అంతే మొత్తంలో పెరుగుతున్నాయి. అయినా.. దీటుగా నెట్టుకొస్తున్న రేవంత్‌ ప్రభుత్వానికి ఎన్నికల కోడ్‌ కలిసొచ్చింది. జూన్‌ వరకు కొన్ని వ్యయాలు తప్పనున్నాయి. దీంతో రాబడి వ్యయాలు అంచనాల మేరకే చేరి ప్రభుత్వానికి కొంత ఉపశమనంగా మారనున్నాయి.

ఆర్థిక పురోగతిలో తెలంగాణ..

- Advertisement -

కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ అద్భుత పురోగతితోపాటు వాస్తవిక వ్యయాల ప్రాతిపదికగా ముందుకు సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో నిధులలేమి, పథకాలకు ఖజానాలో ఇబ్బందులు ఉన్నాయన్న వాదనలు అసంబద్దమైనవేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రికార్డులను తిరగరాస్తూ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లలో కొత్త పంథాలో తెలంగాణ దూసుకుపోతోంది. ప్రజలకు భారం లేకుండా ఖజానాను మరింత పరిపుష్టం చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఆరు గ్యారెంటీలే కీలకం..

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో ఆరు గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. అయితే.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడంలో ఇబ్బందులు తప్పకపోవచ్చనే అభిప్రాయాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పటాపంచలు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని హామీలను ఆచరణలోకి తేగా, భవిష్యత్‌లో మరికొన్ని నెరవేర్చగలిగేవి ఉన్నాయి. మరికొన్ని తక్షణమే నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది.

రైతు రుణమాఫీ ప్రస్తుతం వాయిదా..

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలకు నెలవారీ ఆర్థికసాయం, రైతు భరోసా కింద ఎకరాకు రూ.16 వేలు, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇప్పటికే ఉన్న పథకాలతో పాటు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ ఏటా రూ.1.2 లక్షల కోట్లు- ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం మాత్రమే ఏటా రూ.68,652 కోట్లు అవసరమని గుర్తించి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అదేవిధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.20 వేల కోట్లు అవసరం. ఇప్పుడివి కొంత కాలం వాయిదా పడ్డాయి. దీంతో ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే సమయయం దొరికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement