Sunday, November 17, 2024

Spl Story | ఎత్తైన మంచు శిఖరాలపై తెలంగాణ ఖ్యాతి.. పర్వతారోహణలో భువనగిరి రైతు బిడ్డ!

ఆమె ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబాకిని చెందిన యువతి.. వారి కుటుంబం నేపథ్యం వ్యవసాయం.. నిరాడంబరమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ 24 ఏళ్ల తెలంగాణ యువతి ఇప్పుడు యావత్​ దేశాన్ని ఆకర్షిస్తోంది. తన టార్గెట్​ రీచ్​ కావడానికి పేదరికం అడ్డుకాలేదు. సంకల్పం బలంతో అంటార్కిటికాలోని అతిపెద్ద మంచు పర్వతాన్ని అధిరోహించి సగర్వంగా భారత జెండా ఎగరేసింది భువనగిరికి చెందిన యువతి అన్విత.

– నాగరాజు చంద్రగిరి​, ఆంధ్రప్రభ

తెలంగాణలోని భువనగిరికి చెందిన అన్విత పడమటి పర్వతారోహణలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఆమె తండ్రి మధుసూదన్​రెడ్డి వ్యవసాయదారు. తల్లి చంద్రకళ ఓ అంగన్​వాడీ స్కూల్​లో పనిచేస్తున్నారు. ఇక.. ఏడు ఖండాలలో విస్తరించి ఉన్న ఏడు శిఖరాలను అధిరోహించాలన్న టార్గెట్​తో అన్విత ఉంది. అంటార్కిటికాలో ఈ ఘనత ఆమె నాలుగో విజయంగా చెప్పుకోవాలి.  మౌంట్ మానస్లూ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన మూడు నెలల తర్వాత, అన్విత పడమటి (24) అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించింది. డిసెంబర్ 17న అంటార్కిటికా ఖండంలోని ఎత్తైన శిఖరం – సముద్ర మట్టానికి 4,892 మీటర్ల ఎత్తులో ఉన్న విన్సన్ పర్వతాన్ని అన్విత అధిరోహించి మరో రికార్డుని నెలకొల్పింది. 

డిసెంబర్ 3న హైదరాబాద్ నుండి చిలీలోని పుంటా అరేనాస్‌కు బయలుదేరిన ట్రాన్స్ సెండ్ అడ్వెంచర్స్ ఇండియాతో అంటార్కిటికాలోని అంతర్జాతీయ యాత్ర బృందంలో అన్విత కూడా ఉంది. డాక్యుమెంటేషన్, ఇతర రాతపని పూర్తి చేసిన తర్వాత.. ఆమె డిసెంబర్ 7న అంటార్కిటికాలోని యూనియన్ గ్లేసియర్‌కు వెళ్లింది.

ఈ పర్వతాన్ని అధిరోహించడం అంత తేలికైనది కాదు..  కానీ, తాను జట్టుతో కలిసి ఈ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశానని చెబుతోంది అన్విత. మునుపటి పర్వతారోహణ అనుభవం కూడా తనకు చాలా ఉపయోగపడిందని, 7 శిఖరాలను అధిరోహించాలన్న తన టార్గెట్​లో ఇది 4వ శిఖరంగా అన్విత తెలిపారు. డిసెంబర్ 8 నుండి 15 వరకు అన్విత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు.. విపరీతమైన గాలులతో కూడిన పరిస్థితులను ఎదుర్కొంది. అంతటి కఠినమైన అంటార్కిటికా వాతావరణానికి అలవాటు పడింది. చివరకు డిసెంబర్ 16న ఆమె శిఖరారోహణకు ప్రయత్నించింది.

- Advertisement -

“ఇది చాలా విపరీతమైన గాలులతో కూడిన రోజు. దాదాపు మైనస్ 30 డిగ్రీల టెంపరేచర్​ ఉంది. నా చేతులు చాలా చల్లగా ఉన్నాయి. నేను టెంట్ కూడా వేయలేకపోయాను. మేము చాలా కష్టపడి టెంట్‌ని ఏర్పాటు చేసుకున్నాం. టెంట్ లోపల కూడా దాదాపు మైనస్ 35 డిగ్రీలు ఉంది. డిసెంబర్ 16న మేము ఉదయం 11 గంటల ప్రాంతంలో శిఖరాగ్రానికి బయలుదేరాం. రాత్రి 9 గంటల ప్రాంతంలో Mt.Vinson శిఖరానికి చేరుకున్నాము. శిఖరంపై 4,892 మీటర్ల ఎత్తులో భారత జెండాను ఎగరేశాము. శిఖరంపై దాదాపు 20 నిమిషాల సేపు ఉన్నాం.. అది మాకు చాలా గొప్ప అనుభవం.. ఎందుకంటే పైన ఉన్న పర్వతం పిరమిడ్ మాదిరిగా ఉంటుంది”అని అన్విత ఉద్వేగంగా చెప్పుకొచ్చింది. ఇక.. చాలా గాలి కారణంగా తాము వస్తువులన్నీ ప్యాక్ చేశామని, అదే రోజు నేరుగా బేస్ క్యాంప్‌కు చేరుకున్నట్టు తెలిపింది. ఇట్లా రావడానికి దాదాపు 20 గంటలకు పైగా పట్టినట్టు తన జ్ఞాపకాలను నెమరువేసుకుంది.

కాగా, అన్విత కోచ్, మెంటర్, శేఖర్ బాబు బాచినేపల్లి మాట్లాడుతూ.. “విన్సన్ పర్వతాన్ని ఎక్కడం సాంకేతికంగా కష్టం కాదు.. కానీ, పర్వత ప్రదేశం చాలా రిమోట్‌గా ఉంటుంది. పరిస్థితులు తరచుగా మారుతుంటాయి. విపరీతమైన శీతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పర్వతారోహణ చేయాలి”అని చెప్పారు.

అన్విత గత రికార్డులు..

  • ‌‌ జనవరి 2021లో అన్విత ఆఫ్రికా ఖండంలోని ఎత్తైన శిఖరం అయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది.
  • ఆమె డిసెంబర్ 2021లో ఐరోపా ఖండంలోని ఎత్తైన శిఖరం ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి ఈ ఘనతను సాధించిన ఏకైక భారతీయురాలుగా నిలిచింది.
  • మే 2022లో ఆమె ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది.
  • అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరం అయిన మౌంట్ విన్సన్‌పై ఆమె విజయం సాధించి.
  • ఏడు శిఖరాగ్ర లక్ష్యాలను చేరుకోవడానికి అన్విత కేవలం మరో మూడు శిఖరాల దూరంలో ఉంది.
  • దక్షిణ అమెరికాలోని మౌంట్ అకాన్‌కాగువా, ఆస్ట్రేలియాలోని మౌంట్ కోస్కియుస్కో, ఉత్తర అమెరికాలోని మౌంట్ డెనాలి వంటి పర్వతాలను అన్విత తదుపరి అధిరోహించాల్సి ఉంది.
  • అన్విత తదుపరి లక్ష్యం దక్షిణ అమెరికాలోని ఎత్తైన శిఖరం, అర్జెంటీనాలోని అకాన్‌కాగువా పర్వతం.
  • ఫిబ్రవరిలో ఈ పర్వతారోహణకు తాను సిద్ధమవుతున్నట్టు అన్విత చెబుతోంది.
Advertisement

తాజా వార్తలు

Advertisement