Friday, November 22, 2024

తెలంగాణ రైతుల‌ను ఆదుకోండి..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి..

యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు..
విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే బషీర్ బాగ్ తరహా ఉద్యమం..

వరంగల్ ప్ర‌భ‌న్యూస్ : రాష్ట్రంలో ధాన్యం రైతులను ఆదుకునేందుకు యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ సమీపంలోని భట్టుపల్లి గ్రామంలో కొనుగోళ్లు జరగక వర్షానికి తడిసిన ధాన్యం రాశులను పరిశీలించి, రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాలను రంగంలోకి దించాలని, యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై నెపం నెట్టి తప్పుకోవాలని చూస్తే రైతులు సహించబోరని అన్నారు. రైతులు నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాలు అవసరం ఉండగా 5 వేల కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొంటుందా.. కొనదా.. స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని,ఇప్పటికైనా తెలంగాణ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కి సాగు చట్టాలను తెచ్చిందని, ఏడాది కాలంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయని, చివరకు ఎర్రకోట పైకి కూడా రైతులు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ పోరాటంలో ఏడు వందల మంది రైతులు చనిపోయాక ప్ర‌ధాని మోడీ కళ్లు తెరిచారన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి కొడుకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న రైతులపై కారు పోనిచ్చి ఎనిమిది మంది మృతికి కారణమయ్యార‌ని విమర్శించారు. స్వాతంత్ర్యానంతరం ఏడాది పాటు అన్నం పెట్టే రైతన్న ఆందోళన చేసార‌ని,రైతుల ఆందోళనతో ఎట్టకేలకు మోడీ దిగి వచ్చి చట్టాలను ఉప సంహరించుకున్నారని చెప్పారు. ఆ పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం రైతులకు నష్టం చేసేందుకు విద్యుత్ బిల్లు తేవాలని చూస్తుంద‌ని, విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని, లేదంటే బషీర్ బాగ్ తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement