హైదరాబాద్, ఆంధ్రప్రభ: గడచిన రెండు ఎన్నికల్లో తెలంగాణలో అప్పటి టీఆర్‌ఎస్ ఇప్పటి బీఆర్‌ఎస్ ఓట్ షేర్‌ను బాగా పెంచుకున్నది. మిగతా పార్టీలు క్రమంగా తగ్గించుకుంటూ ఆ షేర్‌ను అధికార పార్టీకి మళ్లించాయి. కానీ 2023 ఎన్నికల్లో ఏ పార్టీ ఏ మాత్రం ప్రజాభిమానం కాపాడుకున్నదో లేక పెంచుకున్నదో… ఎవరికి తగ్గిందో డిసెంబర్ 3న వెల్లడి కానున్నది. రాష్ట్రంలో మూడో శాసనభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ భిన్నాభిప్రాయాలు, రకర కాల ఫలితాలను వెల్లడించాయి. ఓట్ షేర్‌పై విస్తృత విశ్లేషణలు జరుగుతున్నాయి. ఓటర్లు గత రెండు ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు, పార్టీలకిచ్చిన ఓట్ల శాతం… బలాబలాలు ఒకసారి అవలోకనం చేసుకుంటే తెలంగాణ ఎన్నికలు విభిన్నంగా సాగాయని చెప్పుకోవచ్చు. తొలి ఎన్నికలైన 2014లో 34.3శాతం ఓటర్ల మద్దతు సాధించిన టీఆర్‌ఎస్ అనూహ్యంగా విప్లవాత్మక పథకాల అండతో 2018లో 46.9శాతం మద్దతును కూగడట్టుకుంది. ఈ ప్రభం జనంలో జాతీయ పార్టీలు తమ ఓటుబ్యాంకుతోపాటు ఓటర్ల మద్దతునూ భారీగా పోగొట్టుకుని టీఆర్‌ఎస్ వైపుకు మొగ్గు చూపాయి. ఫలితంగా 63 స్థానాలున్న టీఆర్‌ఎస్ అలవోకగా 88 స్థానాలను తన ఖాతాలో వేసు కోగల్గింది. అంటే 2014లో 14.7శాతంగా టీడీపీకి ఉన్న మద్దతును 1.7శాతానికే కట్టడి చేయడంలో టీఆర్‌ఎస్‌పై ప్రజలకున్న విశ్వస నీయత, సీఎం కేసీఆరే కావాలన్న ఆకాంక్షకు అద్దం పట్టింది. ఈ ఓట్ల వరదలో విపక్షాలన్నీ తీవ్రంగానే దెబ్బతిన్నాయి.
2014లో 25.2 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓట్ షేర్ 2018లో దాదాపు 9శాతం టీఆర్‌ఎస్‌కు అప్పచెప్పి 16శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీరి వాటా కూడా అధికార పార్టీకే మళ్లడంతో ప్రజా కూటమిపై ప్రజలు ఆశలు పెట్టుకోలేదని స్పష్టమైంది.2014 సార్వత్రిక ఎన్నికల్లో 68.81 శాతం పోలింగ్ నమోదు కాగా 2018 ముందస్తు ఎన్నికల్లో 73.20శాతం పోలింగ్ జరిగింది. అయితే ఈ పెరిగిన ఓటింగ్ శాతం మూకుమ్మడిగా గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం కావడంతో అదంతా టీఆర్‌ఎస్‌కే లాభంగా పరిణమించింది. పురుష ఓటర్లకంటే మహిళా ఓటర్ల ఓటింగ్ శాతం స్వల్పంగా పెరగడం కూడా టీఆర్‌ఎస్‌కు కలిసొ చ్చింది.
మహిళా ఓటింగ్ శాతం 73.88కాగా పురుషులు ఓటింగ్ శాతం 72.54గా నమోదైంది. మహిళా ఓటింగ్ విషయంలో ప్రత్యేకత చూపిన జిల్లాల్లో టీఆర్‌ఎస్ జయకేతనం ఎగురవేసింది. నిర్మల్ జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్ల స్పందన 6శాతం ఎక్కువగా నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో కూడా పురుషుల కంటే మహిళల ఓటింగ్ 8శాతం పైగా ఎక్కువగా జరిగింది. కామారెడ్డిలో కూడా 3శాతం మహిళా ఓట్ల ఆధిక్యతే కనిపించింది. జగిత్యాలలో 13 శాతం అధికంగా మహిళా ఓటర్ల ఓటింగ్ నమోదైంది. అయితే 2104 ఎన్నికల్లో 68.81శాతం పోలింగ్ నమోదవగా, పార్టీల వారీగా 63 స్థానాలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌కు 34.3శాతం ఓట్ల పర్సెంటేజీ దక్కింది. 21 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ 25.2శాతం ఓటర్ల మద్దతు పొందగా, 15స్థానాలు కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీకి 14.7 శాతం ఓటర్ల మద్దతు లభించింది. ఇక 7 స్థానాల్లో గెల్చిన ఎంఐఎం 3.8 శాతం ఓటర్లను, 5 స్థానాల్లో గెలుపును సొంతం చేసుకున్న బీజేపీ 7.1 శాతం, ఒక ఇండిపెండెంట్ 5 శాతం ఓటింగ్ శాతం, ఏడుగుర ఇతరులు 9.9 శాతం ఓట్ షేర్ పొందారు. అయితే గడచిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- కాంగ్రెస్ – సీపీఐ కలుపుకుని 58.8 శాతం ఓట్ షేర్‌ను పొందింది. ఒంటరిగా టీఆర్‌ఎస్ 34.3 శాతం ఓటింగ్ షేర్‌ను కైవసం చేసుకున్నట్లుగా లెక్కలున్నాయి. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో విపక్షాలు ఒక్కటయ్యాయి.
అప్పటి అధికార టీఆర్‌ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్) పార్టీ మాత్రం ప్రజా సంక్షేమ పథకాలు, నాలుగున్నరేళ్ల అద్భుత పరిపాలనతో ప్రజలకు తమపై నమ్మకం పెరిగిందని, ఆ మేరకు తమకు ఓట్ల శాతం కూడా భారీగా పెరిగిందని భావించింది. గడచిన ఎన్నికల్లో ఆంధోల్‌లో 1.8శాతం స్వల్ప పర్సెంటేజీ ఓట్లతో టీఆర్‌ఎస్ బైటపడగా, మహబూబ్‌నగర్‌లో 2.1శాతం, మల్కాజ్‌గిరీలో 1.2శాతం, నకిరేకల్‌లో 1.3శాతం, రామంగుండంలో 1.7శాతం, సూర్యాపేటలో 1.3 శాతం స్వల్ప ఆధిక్యంతో గెలుపొందింది. 2014లో సీఎం కేసీఆర్ పోటీచేసిన గజ్వేల్‌లో 86,694 ఓట్లను సాధించి 44.1 శాతం ఓటర్ల మద్దతు పొందారు. సమీప ప్రత్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసి 67,303 ఓట్లతో 34.1శాతం ఓటర్ల మద్దతు సొంతం చేసుకున్నారు. తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీచేసి 34,085 ఓట్లతో 17.3శాతం ఓటర్ల మన్నన పొందారు. 2014లో సీఎం కేసీఆర్ 19,391 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2018 ముందస్తు ఎన్నికల్లో అధికారపార్టీ టీఆర్‌ఎస్ 88 సీట్లను కైవసం చేసుకోగా ఈ పార్టీకి 47శాతం ఓట్ షేర్ అనుకూలించింది. సీట్ల పెరుగుదలలో 74శాతం పెరుగుదల సాధ్యమైంది. 2014లో ఈ పార్టీకి 63 సీట్లుండగా ఓట్ షేర్ మాత్రం 34.3 శాతం మాత్రమే. ఇక విడివిడిగా చూస్తే కాంగ్రెస్‌కు 19 సీట్లు గెల్చుకోగా రాష్ట్రంలో వారికి వచ్చిన ఓటర్ల అనుకూలత శాతం 16గా ఉంది. టీడీపీ 2 సీట్లను గెలుచుకోగా ప్రజల నుంచి 1.7శాతం మాత్రమే మద్దతు వచ్చింది. బీజేపీకి దారుణంగా 0.8శాతంతో ఒక సీటు కైవసం చేసుకుంది. 2014లో 2,81,65,885 ఓటర్లుండగా 1,94,43,411 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలింగ్ శాతం 68గా నమోదైంది.
2018 ముందస్తు ఎన్నికల్లో విపక్షాలు ఒక్కటయ్యాయి. ప్రజా కూటమి పేరుతో జతకట్టి పోటీ చేయడంతో మిత్ర పక్షాల ఓట్లు గంపగుత్తాగా పడ్తాయని ప్రజా కూటమి వేసుకున్న అంచనాలు తప్పాయి. ఇక 18 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో 5శాతంపైగా పోలింగ్ పెరగ్గా, 11చోట్ల 1నుంచి 5 శాతంగా పెరుగుదల ఉంది. పోలింగ్ తగ్గిన 16 నియోజకవర్గాల్లో దుబ్బాక మినహా అన్నీ గ్రేటర్ పరిధిలోనివే. రాష్ట్రమంతటా అప్పుడు ఓటింగ్ శాతం పెరిగినా, తగ్గినా టీఆర్‌ఎస్ హవాను మాత్రం అడ్డుకోలేకపోయాయి.