రిజర్వాయర్లలో అడుగంటిన నీటి మట్టం
శ్రీరాంసాగర్‌లో గరిష్ఠ నీటి నిల్వ 112 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ 9.643 టీఎంసీలు
గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గిన వైనం
కాళేశ్వరం నుంచి పంపింగ్ అనుమానమే
మహా ప్రాజెక్టులు నిండితేగానీ సాగర్‌లోకి వరద నీరు
ఆందోళనలో ఆయకట్టుదారులు
తాగునీరు కూడా ప్రశ్నార్థకమే
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ ప్రజలకు కల్పతరువు. మహారాష్ట్రలో జైక్వాడి ప్రాజెక్టు తరువాత తెలంగాణలో గోదావరి నదిపై దీనిని నిర్మించారు. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు ఇది. కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 156 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. అయితే దీనికి అనుగుణంగా 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించారు. అయితే 196 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా రూపకల్పన చేశారు.
శ్రీరాంసాగర్ జలాశయంలో గరిష్ఠ నీటి మట్టం 1091 అడుగులు. అంటే 90 శత కోటి ఘనపుటడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ కేవలం 9.964 టీఎంసీలు మాత్రమే ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం 1059.00 అడుగులకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో నీటిమట్టం 1065.10 అడుగులు కాగా 15.986 టిఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు ఆయకట్టు 18 లక్షల ఎకరాలుగా స్థిరీకరించారు. అయితే ప్రస్తుతతం 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా ప్రాజెక్టు నుంచి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. శ్రీరాంసాగర్ పై ఆధారపడి సుమారు 50 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. ఎత్తిపోతల పథకాల కింద సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
మిషన్ భగీరథ…
శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా జగిత్యాల, అదిలాబాద్, నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలకు రోజుకు 231 క్యూసెక్కుల తాగునీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వలు తగ్గితే తాగునీటి సమస్య ఎదుర్కొనే పరిస్థతి ఏర్పడుతుందని ఆయా పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పూర్తిగా పడిపోయిన నీటి మట్టం
ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గిపోతున్నాయి. ఒక వైపు గోదావరి జలాలు రాకపోవడం… మరోవైపు వర్షాలు లేక వరద నీరు రాకపోవడం వెరసీ ప్రాజెక్టులో నీటి మట్టం అడుగంటిపోయాయి. పూడికతో ప్రాజెక్టు సామర్థ్యం వాస్తవానికి ఎంత వుందో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రస్తుతానికి తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి నీటిని అధికారులు వినియోగిస్తున్నారు. వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటి వరకు రెండు టీఎంసీల నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చింది. ప్రస్తుతం రోజు 182 క్యూసెక్కుల నీరు ఆవిరవుతుందని అధికారుల అంచనా. వర్షాలు వస్తే గాని ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరే అవకాశం లేదు. ఒక వైపు వర్షాలు పడకపోవడం… మరో వైపు ఎండల తీవ్రత అధికంగా ఉండటం వల్ల నీరు ఆవిరి అవుతుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది కూడా వర్షాలు ఆలస్యంగానే వచ్చాయి. ఈసారి కూడా ఆలస్యంగా కురిసే అవకాశం ఉందని అధికారులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.
మహాప్రాజెక్టులతో పెను ముప్పు
బహుళార్థ సాధక ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ కు మహారాష్ట్ర ప్రాజెక్టులతోనే పెను ముప్పు వచ్చింది. గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో అనుమతి లేని అడ్డగోలుగా ఆనకట్టలు, ప్రాజెక్టులు నిర్మించారు. మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే గాని శ్రీరాంసాగర్‌కు వరదనీరు వచ్చే అవకాశం లేదు. మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో కూడా నీరు డెడ్ స్టోరేజికి చేరిందని తెలుస్తోంది. అక్కడ వర్షాలు అంతంత మాత్రమే కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టులోకి వరద నీరు రావాలంటే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే గాని సీజన్ గట్టెక్కే అవకాశం లేదు.
ఆందోళనకరంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పైనే మిషన్ భగీరథ తాగునీటి పథకం పూర్తిగా ఆధారపడి ఉంది. తాగునీటిని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందించాల్సిందే. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న నీటిని వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోతే తాగునీటికి ఆందోళన తప్పదు. అలాంటప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గతంలో ఒకసారి ఇలాంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థతి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. మంజీరా, గడ్డెన్నవాగు నుంచి కూడా వరదనీరు వస్తుంది.