Thursday, November 21, 2024

Telangana: పోయినేడు కంటే ఈసారి నేరాలు పెరిగిన‌య్‌: డీజీపీ మహేందర్ రెడ్డి

గ‌త ఏడాదితో పోలిస్తే తెలంగాణలో ఈసారి నేరాలు పెరిగాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 4.6 శాతం మేర నేరాలు ఎక్కువగా నమోదయ్యాయన్నారు. ఇవాళ ‘వార్షిక నేర నివేదిక 2021’ని విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేరాల్లో నిందితులకు శిక్షపడిన కేసులు 50.3 శాతమని చెప్పారు. 80 కేసుల్లో 126 మందికి జీవిత ఖైదు పడిందని తెలిపారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉండాలన్న ప్రభుత్వ సూచనలను సమర్థంగా అమలు చేశామన్నారు. ఇప్పటిదాకా 98 మంది నక్సలైట్లను అరెస్ట్ చేశామని, మరో 133 మంది లొంగిపోయారని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదని, ఒక్క నిర్మల్ జిల్లా భైంసాలోనే చిన్న గొడవలు జరిగాయని ఆయన వెల్లడించారు.

ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ద్వారా చేరువయ్యామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. డయల్ 100కు ఈ ఏడాది 11.24 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. హైదరాబాద్ సిటీలో ఫిర్యాదు వచ్చిన ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారన్నారు. పేద, ధనిక తేడా లేకుండా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చే వారి కోసం 800 స్టేషన్లలో రిసెప్షన్లను ఏర్పాటు చేశామన్నారు. షీ టీమ్స్ కు 5,145 ఫిర్యాదులు వచ్చాయని, బాధితులకు భరోసా కల్పించాయని తెలిపారు. హాక్ ఐ ద్వారా 83 వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు.

కేసులు పెట్టినా తరచూ నేరాలకు పాల్పడుతున్న 664 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు డీజీపీ. రాష్ట్ర వ్యాప్తంగా 8.5 లక్షల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇక, ఈ ఏడాది 8,828 సైబర్ నేరాలు నమోదైనట్టు డీజీపీ చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 6,690 మంది చనిపోయారన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై రూ.879 కోట్ల జరిమానా వేశామని డీజీపీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement