Friday, November 22, 2024

లెఫ్ట్, జ‌న‌స‌మితితో పొత్తుకు సై అంటున్న రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పొత్తులపై తన వైఖరిని తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎవరితో పొత్తులకు వెళ్తుందనే విషయాన్ని కుండబద్దలు కొట్టారు. తన మాతృసంస్థ తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో టీడీపీ పొత్తులకు వెళుతున్నందున ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు కలసి పోటీ చేయడం సాధ్యంకాదన్నారు. అదేవిధంగా వామపక్షాలు, తెలంగాణ జనసమితితో పొత్తులపై అధిష్టానం సంప్రదింపులు జరుపుతుందని కేడర్‌కు విస్పష్టం చేశారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా పొత్తులపై రేవంత్‌ పలు సభల్లో ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా తనతో పాటు అందరు నాయకులు సమిష్టిగా కృషి చేస్తారని, వ్యక్తిగత విబేధాలను పక్కనబెట్టి కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు కలిసికట్టుగా పోరాటం చేస్తామని కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. రేవంత్‌ యాత్రలో ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌ వి.హనుమంతరావు తదితరులు పాల్గొని తాము కలిసికట్టుగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. సీనియర్‌ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి పీసీసీ చీఫ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్‌ సరైన నేతగా అభివర్ణించడం విశేషం.

రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన తర్వాత భట్టి, వీహెచ్‌తో పాటు ఎంపీలు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఒక దశలో రేవంత్‌ను పీసీసీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పించేందుకు కూడా ప్రయత్నించారు. రేవంత్‌ను బాధ్యతల నుంచి తప్పించేందుకు అధిష్టానం సుముఖంగా లేదని తెలిసిన తర్వాత నేతలు మెత్తబడ్డారు. రాయపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ తర్వాత వారి మధ్య సయోధ్య కనబడుతోంది. ముగ్గురు ఎంపీలు రేవంత్‌, ఉత్తమ్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లీనరీలో హుషారుగా మాట్లాడుకోవడం, కలిసి తిరగడం సమావేశాలకు వెళ్లిన నేతలకు ఉత్సాహం తెప్పించిందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. అంతేగాక ఉమ్మడి శత్రువు కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇప్పటి వరకు ఏకమైనట్లే కనిపిస్తోంది. ఇదే ఐక్యత ఎన్నికల వరకు ఉంటే బీఆర్‌ఎస్‌ను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్న ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర పార్టీ దశను మార్చేస్తుందని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement