Saturday, November 23, 2024

Paddy issue : కేంద్రానికి 24 గంటలే డెడ్ లైన్.. తన తడాఖా చూపిస్తానన్న కేసీఆర్

తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీలో జరిగిన టీఆర్ఎస్ దీక్షలో సీఎం కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ధాన్యం కొనాలన్న డిమాండ్‌తో తెలంగాణ మంత్రిమండలి, రైతులు ఢిల్లీకి ఎందుకు రావాల్సి వచ్చింది? అని అన్నారు. “నిన్ను గద్దె దించే సత్తా రైతులకు ఉంది” అంటూ భారత ప్రధాని మోదీని హెచ్చరించారు.  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ మంత్రులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు నూకల బియ్యం పెట్టమని పీయూష్ గోయల్ అన్నారు అని తెలిపారు. ధర్మబద్ధమైన డిమాండుతో మేమొస్తే, ఆయన ఇలా అవమానించారని అన్నారు. ఆయన పీయూష్ గోయల్ కాదు – పీయూష్ గోల్‌మాల్ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో తెలంగాణలో చేపట్టాల్సిన ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయిందన్నారు. తెలంగాణలో 30 లక్షల బోర్ బావులు ఉన్నాయని, వాటిపై ఆధారపడి రైతులు వ్యవసాయం చేయాల్సి వచ్చిందన్నారు. ఎన్నో కష్టాలకోర్చి తెలంగాణ రైతులు వ్యవసాయం చేయాల్సి వచ్చిందని తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 20 లక్షల మంది కార్మికులు దేశంలో నలుమూలలకు వెళ్లారన్నారు. 1956 నుంచి మొదలుపెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే వచ్చామని, అనేక పోరాటాల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు.

రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే వ్యవసాయానికే మా అత్యున్నత ఇచ్చామన్నారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెంచి, వ్యవసాయానికి ఊతమిచ్చేలా చేశామని తెలిపారు. అప్పటికి విద్యుత్తు పెద్ద సమస్యగా ఉండేదన్న కేసీఆర్… నేడు 24 గంటలూ విద్యుత్తు పవర్ కట్ లేకుండా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దేశంలో రైతులకు 24 గంటలూ ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. ”ఏం చమత్కారం చేశారు తెలంగాణలో అని పీయూష్ గోల్‌మాల్ అంటున్నారు. అవును. చమత్కారమే చేశాం. 2014 నుంచి ఇప్పటి వరకు 1 కోటి ఎకరాల అదనపు భూమిని సాగులోకి తీసుకొచ్చాం. దీనికి ప్రశంసించాల్సింది పోయి, మమ్మల్ని అవమానాలకు గురిచేస్తున్నారు. ప్రధాన మంత్రి మోదీ రైతులకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశ రైతులు బిచ్చం అడగడం లేదు, హక్కులు కోరుతున్నారు. కొత్త వ్యవసాయ విధానం రూపొందించండి. మేం కూడా మీకు సహకరిస్తాం. లేదంటే మిమ్మల్ని గద్దె దించి, మేమే కొత్త పాలసీ తయారుచేసుకుంటాం. పంటమార్పిడి చేయమని కేంద్రం చెబితే, మేము గ్రామగ్రామానికి, ప్రతి రైతుకూ పంటమార్చాలని చెప్పాం. కానీ వీళ్ల పార్టీకే చెందిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ “మీరు వరి వేయండి. ప్రతి గింజా మేం కొంటాం” అన్నారు. (కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడిన వీడియో ప్లే చేసి చూపించిన కేసీఆర్) టీఆర్ఎస్ శ్రేణులు రైతుల కోసం ఇక్కడ ధర్నా చేస్తుంటే, బీజేపీ అక్కడ హైదరాబాద్‌లో ధర్నా చేస్తోంది. వాళ్లకు సిగ్గుందా? రైతులను గంగలో ముంచేంత బలహీనమైంది కాదు తెలంగాణ ప్రభుత్వం.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనేందుకు ప్రధాని దగ్గర డబ్బు లేదా – మనసు లేదా? అని ప్రశ్నించారు. రైతులకు రాజ్యాంగబద్ధ రక్షణ దొరికేవరకు మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తామంతా రాకేశ్ టికాయత్ పోరాటానికి మద్ధతిస్తున్నామని ప్రకటించారు. దేశంలో మేం సృష్టించే భూకంపానికి పీయూష్ గోల్‌మాల్ కూడా పరుగులు పెట్టాల్సి వస్తుందని సెటైర్లు వేశారు. హిట్లర్, ముస్సోలినీ వంటి ఎందరో మట్టికలిశారు. మీరెంత? అని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ రంగానికి అప్పగించి, రైతులను కూలీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈడీ, సీబీఐలు ఏ బీజేపీ నేత ఇంటికీ వెళ్లవని చెప్పారు. తన్ను జైలుకు పంపుతా అని అంటున్నారని, దమ్ముంటే తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉన్న చోటామోటా కుక్కలు మొరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. మిగతా దేశంలో ఎలా ధాన్యం కొంటున్నారో.. మా దగ్గర కూడా అలాగే ధాన్యం కొనండి అని నరేంద్ర మోదీకి, పీయూష్ గోయల్‌కు రెండు చేతులూ జోడించి కోరారు. 24 గంటల్లో మీ సమాధానం చెప్పాలని, లేదంటే మేం ఏం చేయాలో చేసి చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత మా వ్యూహాలు, ప్రణాళికలు రచించుకుని ముందుకెళ్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement