Saturday, November 16, 2024

నేడు తమిళనాడు సీఎంతో కేసీఆర్ భేటీ.. వాటిపైనే ప్రధాన చర్చ

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్​తో సమావేశం కానున్నారు. నిన్న శ్రీరంగంలో శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్.. రాత్రికి చెన్నైలో బస చేశారు. జాతీయ రాజకీయపరమైన అంశాలు, పాలనాపరమైన విషయాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నారని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు, యాసంగి పంటల విషయంలో కేంద్రం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం ఉన్న కేసీఆర్.. ఆ అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు చెన్నైలోనే ఉన్న రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్​ను కూడా కేసీఆర్ కలవనున్నట్లు సమాచారం.

నిన్న కుటుంబసభ్యులతో కలిసి త‌మిళ‌నాడులోని తిరుచిరాప‌ల్లి జిల్లా శ్రీరంగం వెళ్లిన కేసీఆర్.. రంగ‌నాథ‌స్వామి ఆల‌యంలో ప్రత్యేక పూజ‌లు చేశారు. రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్ మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ఆయ‌న కుటుంబ స‌భ్యులు గ‌జ‌రాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన అర్ధాంగి శోభ, తనయుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాన్షు, మనవరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

తాను శ్రీరంగ ఆలయానికి రావడం ఇది రెండోసారి అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి తనకు మంచి స్నేహితుడని అన్నారు. ఎన్నికల్లో డీఎంకే గెలిచిన తర్వాత తొలిసారి ఇక్కడకు వచ్చానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement