Thursday, November 21, 2024

కేంద్రం గెజిట్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్?

ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వం గరంగరం అవుతోంది. రాత్రికి రాత్రే తెలుగు రాష్ట్రాలకు గోదావరి, కృష్ణా బోర్డు పరిధిలను నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం గెజిట్ ఇవ్వడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.

మరోవైపు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని ఇటు తెలంగాణకు… రాజోలిబండ కుడికాలువ పనులు ఆపివేయాలని అటు ఏపీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. సీడ్ మనీ కింద రెండు రాష్ట్రాలు రూ.200 కోట్లను బోర్డుల వద్ద డిపాజిట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం 60 రోజుల గడువును కేంద్రం ఇచ్చింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత సుమారు ఏడేళ్లకు గోదావరి, కృష్ణా బోర్డులకు కేంద్ర ప్రభుత్వం పరిధిని కేటాయించింది. గెజిట్ నోటిఫికేషన్ ఆదేశాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాను ఇరు రాష్ట్రాలకు పంపించారు. దీని ఆధారంగానే ఫైనల్ నోటిఫికేషన్ వెలువడనుంది.

అయితే కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌ను ఏపీ సర్కారు స్వాగతిస్తోంది. ఇది తమ విజయంగా ఆ పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని తమ అభిమతమని, అయితే తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టులను చేపట్టి సాగునీరు విషయంలో ఏపీకి అన్యాయం చేస్తోందని సజ్జల ఆరోపించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తమ సీఎం లక్షణం కాదని.. అందుకే జలవివాదం విషయంలో కేంద్రానికి లేఖలు రాసినట్లు వివరించారు.

ఈ వార్త కూడా చదవండి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement