Saturday, November 23, 2024

పీఆర్సీలో ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పీఆర్సీపై సంచలన ప్రకటన చేశారు. పీఆర్సీలో 30% ఫిట్‌మెంట్ ఇస్తున్నట్టు తెలిపారు. కరోనాతో ఆర్థిక మాంద్యం కారణంగా 11వ పీఆర్సీ అమలు ఆలస్యమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులది కీలక పాత్ర అని ప్రశంసించారు. ఉద్యోగుల వేతన సవరణ ప్రతీ ఐదేళ్లకు ఒకసారి చేస్తామని ప్రకటించారు. త్వరలోనే 50వేల ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించారు. తమది ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని తెలిపారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులకు కూడా పీఆర్సీ వర్తిస్తుందన్నారు. వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్ వాడీలకూ పీఆర్సీ వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుండి కొత్త పీఆర్సీ అమలులోకి వస్తుందని కేసీఆర్ తెలిపారు. టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రామాణికంగా ఉపాధ్యాయుల పెన్షన్లు ఉంటాయన్నారు. అటు పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ళకు పెంచుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పదవీ విరమణ సమయంలో అందించే గ్రాట్యుటీ రూ.12 లక్షల నుండి రూ.16 లక్షలకు పెంచుతున్నామని కేసీఆర్ తెలిపారు.

కాగా 9,17,797 ఉద్యోగులకు పీఆర్సీ 30 శాతం పెంచుతున్నట్లు కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏప్రిల్ 1 నుంచి వీరందరికీ పీఆర్సీ అమలు అవుతుందని స్పష్టం చేశారు. అటు కస్తూర్భా స్కూల్స్ ఉద్యోగినులకు 180 రోజులు ప్రసూతి సెలవులు ప్రకటించారు. EHS నూతన విధివిధానాలు నిర్ణయించేందుకు స్టీరింగ్ కమిటీ వేస్తామన్నారు. పదవీ విరమణ పొందిన టీచర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ (15శాతం) అర్హతను 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు తగ్గించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement