Monday, November 25, 2024

త్వరలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ.. దళిత వర్గానికి డిప్యూటీ సీఎం పదవి!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుంది. తాజా కేబినెట్ విస్తరణలో దళిత వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి దక్కనుందని సమాచారం. హుజురాబాద్ ఉప ఎన్నిక కంటే ముందే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తోంది. అయితే, ఎస్సీలపై అంత ప్రేమ ఉంటే.. దళితులని డిప్యూటీ సీఎంగా ఎందుకు చేయరని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు పథకం అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ గా దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో దళిత వర్గానికి చెందిన టి.రాజయ్య, కడియం శ్రీహరిలు డిప్యూటీ సీఎంలుగా పని చేశారు. అయితే, అనంతరం రాజయ్య ఆ పదవిని కోల్పోయారు.

వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన తర్వాత ఆ శాఖను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. ఈటల బీజేపీలో చేరిన అనంతరం సీఎం కేసీఆర్ తన కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక.. దాదాపు రెండేళ్ల తర్వాత సీఎం కేసీఆర్ మంత్రి వర్గాన్ని పునర్వవస్థీకర చేయనున్నారు. ఈసారి ఖచ్చితంగా పదవులు పదేరం ఉంటుందనే చర్చ ఊపందుకుంది. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వారిని మంత్రి పదవుల నుంచి తప్పించి.. కొత్త వారికి అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ ఇచ్చిన టాస్క్ పూర్తి చేసిన వారికి, పార్టీకి విధేయులుగా ఉన్న వారికి పదవులు కట్టబెడుతారని గులాబీ వర్గాలంటున్నాయి.

రాష్ట్రంలో దళిత జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలు కనీసం ముగ్గురు మంత్రులు కేబినెట్ లో ఉండాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను డిప్యూటీ సీఎం పదవికి ప్రమోట్ చేయాలి లేదా మరొక ఎస్సీ నాయకుడికి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుడిని సీఎంగా చేస్తానన్న కేసీఆర్.. మాట తప్పి దళితులకు ద్రోహం చేశారని విమర్శించారు. దళితుల అభివృద్ధి అంటున్న కేసీఆర్.. తన కేబినట్ లో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ నేత జీవర్ రెడ్డి సైతం ప్రశ్నించారు. కొప్పులు ఈశ్వర్ లాంటి వారిని డిప్యూటీ సీఎంగా ఎందుకు చేయలేదని నిలదీశారు. ప్రతిపక్షాల నుంచి ఈ తరహా డిమండ్ అధికం అవ్వడంతో సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు బీసీ వర్గానికి చెందిన ఈటలను బహిష్కరించడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితో భర్తీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. కేసీఆర్ మంత్రివర్గంలో మొత్తం నలుగురు బీసీ మంత్రులు ఉండగా.. ఈటల బర్తరఫ్ తో ఆ సంఖ్య మూడుకు చేరింది. బీసీ వర్గానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ లు కేబినెట్ మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక, కమ్మ (పువ్వాడ అజయ్ కుమార్), ఎస్టీ (సత్యవతి రాథోడ్), ఎస్సీ (ఈశ్వర్) ముస్లిం (మహ్మద్ మహమూద్ అలీ) వర్గాల నుండి ఒక్కొక్క మంత్రి ఉన్నారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు మొత్తం నలుగురు కేబినేట్ లో ఉండగా..  రెడ్డి వర్గానికి చెందిన ఆరుగురు మంత్రులు కొనసాగుతున్నారు. అందులో ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లా రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు రెడ్డి సామాజిక వర్గం కోటాలో మంత్రులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తర్వలో జరిగే మంత్రివర్గ విస్తరణ ఎవరికి చాన్స్ దక్కుతుందని అనేది ఉత్కంఠగా మారింది. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఎస్సీలకు డిప్యూటీ సీఎంగా ఛాన్స్ ఇస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.

ఇది కూడా చదవండిః జగన్​ పాలనలో ఆ రెండూ ఎక్కువే : అయ్యన్న

Advertisement

తాజా వార్తలు

Advertisement