ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న 2022-23 రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్లో మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ 2022-23కి ఆమోదం తెలుపనుంది. ముఖ్యంగా దళితుల బంధుతోపాటు సంక్షేమ పథకాల అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులపై మంత్రివర్గం చర్చించి తగిన నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ బడ్జెట్ రూ.2.5 లక్షల కోట్లుగా అంచనా వేసినట్లు సమాచారం. శాఖల వారీగా కేటాయింపులు, ఉద్యోగాల భర్తీ, కొత్త పథకం ప్రవేశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
సోమవారం రాష్ట్ర బడ్జెట్ 2022-23ని అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ సమావేవాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ భేటీ సందర్భంగా బడ్జెట్ లోని అంశాలను మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు విపక్షాలను ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి అనేదానిపై మంత్రులకు సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నారు.