తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత/ పొడిగింపు, కరోనా పరిస్థితులు, వైరస్ కట్టడికి శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, కరోనా మూడోదశ విజృంభణకు సన్నద్ధం, వైద్యం, నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
అలాగే, రైతుబంధు, వ్యవసాయ పనులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ జరపనున్నారు. ఈ వానాకాలం సాగునీరు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు చేపట్టిన చర్యలపై, తదితర అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మరోవైపు జూన్ 7న రాష్ట్రంలోని 19 జిల్లా కేంద్రాల్లో ప్రారంభించనున్న డయాగ్నస్టిక్ సెంటర్లను జూన్ 9న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులందరూ తమ జిల్లాలలో డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం ఆదేశించారు. మంత్రులు లేని చోట్ల వీటిని ప్రారంభించడానికి ప్రముఖులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏ కేంద్రంలో ఏ మంత్రి హాజరు కావాలి అనే దానిపై కూడా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.